భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లిలో వ్యవసాయ బోరు బావుల వద్ద ఉన్న మోటారు వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం వేకువజామున చోరీ చేశారు. 12 మోటర్ల వైర్లను చోరీ చేసి వాటిని దగ్ధం చేసి అందులో ఉన్న కాపర్ తీగలను ఎత్తుకెళ్లారు. నెల రోజులుగా బస్వాపూర్, గుర్జకుంట, ర్యాగట్లపల్లి, రామేశ్వర్‌పల్లి గ్రామాల్లో మోటర్ వైర్లను, ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ కాయిల్స్‌ను అపహరించుకెళ్లారు. పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి రూరల్: బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని అడవి పంది ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి. తాడ్వాయి మండలం దేవాయిపల్లికి చెందిన రాములు అనే వ్యక్తి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ శివారులోని ఎస్పీఆర్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అతను బైక్‌పై డ్యూటీలో భాగంగా స్కూల్‌కు వస్తుండగా లింగాపూర్ రోడ్డుపై బైక్‌ను అడవిపంది ఢీకొన్నది. గాయాలపాలైన రాములును స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పిట్లం(జుక్కల్): మండలంలోని కంబాపూ ర్ గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పా ము కలకలం రేపింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాము కనిపించడంతో విద్యార్థులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ప్రధానోపాధ్యాయుడు గ్రామస్తుల సహాయంతో పామును చంపివేశారు. ఇదే పాఠశాలలో గతంలో సైతం పాము వచ్చింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


