జాగ్రత్తలు తీసుకోకుండానే మరమ్మతులు...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జాతీయ రహదారులపై వాహనాలను నిలపడం ప్రమాదకరమని తెలిసినా కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట రోడ్డుపై వాహనాలను నిలపడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 161 వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు బైకుపై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లా మీదుగా వెళుతున్న 44వ జాతీయ రహదారిపై పలు చోట్ల వాహనాలు నిలపడం మూలంగా గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. కొన్నిసార్లు వాహనాలు చెడిపోయి ఆగిపోవడం, మరికొన్నిసార్లు రోడ్డు మీదే పార్కింగ్ చేయడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదేని పరిస్థితుల్లో వాహనాన్ని నిలపాలి అనుకున్నప్పుడు రోడ్డు కిందికి తీసుకువెళ్లాలి. లేదా వాహనం చెడిపోయినపుడు రోడ్డుపై వెళ్లే వాహనాదారులకు కనబడేలా రక్షణ ఏర్పాట్లు చేయాలి. కానీ ఎక్కడా అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జాతీయ రహదారులతోపాటు రాష్ట్రీయ రహదారులు, ఇతర రహదారులపైనా నిర్లక్ష్యపు పార్కింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాన్సువాడ నుంచి గాంధారి మీదుగా పద్మాజీవాడీ ఎక్స్‌రోడ్డుకు వచ్చే రహదారిపై పలు ప్రమాదాలు జరిగాయి. అలాగే కామారెడ్డి – సిరిసిల్ల రహదారి, కామారెడ్డి –ఎల్లారెడ్డి రోడ్డుపైనా ఎన్నో సంఘటనలు జరిగాయి. పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం మూలంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
ప్రధాన రహదారి పక్కన వాహనాలను తాత్కాలికంగా నిలిపి ఉంచుకోవడానికి, వాహనదారులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, సేదతీరడానికి జాతీయ రహదారులపై లే బై సౌకర్యం కల్పించారు. దాదాపు అన్ని జాతీయ రహదారులపై పలు చోట్ల లేబై సౌకర్యం ఉంది. డ్రైవర్‌కు నిద్ర వచ్చి వాహనాన్ని నిలిపివేయాలని అనుకుంటే లేబై ఉన్న చోట ఆపుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయ్‌లెట్స్ కూడా లేబై స్థలంలో సౌకర్యం కల్పించారు. అయితే చాలా మంది వాహనాదారులు దాన్ని సరిగా వాడుకోవడం లేదు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తున్నారు.
జాతీయ రహదారులపై రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు సిబ్బంది రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనాలు ఆపి ఉన్నట్టయితే చర్యలు తీసుకోవలసి ఉంటుంది. వాహనదారులను హెచ్చరించి రోడ్డు కిందకు లేదంటే లేబై ఉన్న చోటుకు తీసుకువెళ్లేలా చూడాలి. రిపేర్ సమస్య వచ్చిన వాహనాలకు అవసరమైన ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తే ఇబ్బందులు ఉండవు. ప్రమాదాలు జరిగిన తరువాత స్పందించే కన్నా ముందుగానే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జాతీయ రహదారులపై వెళుతున్న వాహనాలకు ఏదైనా సమస్య తలెత్తినపుడు వాహనాన్ని మెల్లిగా రోడ్డు కిందకు దింపే ప్రయత్నం చేయాలి. కానీ చాలామంది ఎక్కడ ఆగిపోతే అక్కడే నిలిపివేస్తున్నారు. కొందరు ఎలాంటి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకుండానే మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. వాహనం కదలలేని పరిస్థితి ఉన్నపుడు కచ్చితంగా అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెనకాల నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది కలగకుండా రోడ్డుపై ఏదైనా ఏర్పాట్లు చేయాలి. కానీ చాలా మంది దీనిని పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
జాతీయ రహదారులపై
ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్
రక్షణ చర్యలూ తీసుకోని పలువురు..
రాత్రి వేళలో ప్రమాదాలకు ఆస్కారం
రోడ్డు ప్రమాదాలతో గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు


