ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..? | Actor Michael Patrick diagnosed with Motor Neurone Disease | Sakshi
Sakshi News home page

ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?

Apr 10 2026 4:13 PM | Updated on Apr 10 2026 4:27 PM

Actor Michael Patrick diagnosed with Motor Neurone Disease

గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్ల వయసులో నాడీ సంబంధిత వ్యాధి మోటార్‌ న్యూరాన్‌ వ్యాధితో మృతి చెందారు. ఏప్రిల్ 9, 2026న, అతను మరణించినట్లు ఆయన భార్య నవోమి షీహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆయన గత రాత్రి నార్తర్న్‌ ఐర్లాండ్‌ హాస్పిస్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపింది. ఆయనకు ఫిబ్రవరి 1, 2023న అతనికి మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు, అక్కడ అద్భుతమైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. నయం చేయలేని ఈ వ్యాధి కారణంగా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నటుడిని పొట్టనబెట్టుకున్న మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి అంటే..?, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ..
పేరు సూచించినట్లుగా, మోటార్ న్యూరాన్ వ్యాధి (MND) అనేది న్యూరాన్లు, చలనశీలతకు సంబంధించిన ఒక వ్యాధి. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, MND అనేది మోటార్ న్యూరాన్‌లను నాశనం చేసే నరాల సంబంధిత రుగ్మతల సమూహాన్ని సూచిస్తుంది. ఈ న్యూరాన్లు మింగడం, మాట్లాడటం, నడవడం, శ్వాస తీసుకోవడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాయి.

సింపుల్‌గా చెప్పాలంటే.. మెదడులోని న్యూరాన్ల (ఎగువ మోటార్ న్యూరాన్లు) నుంచి వచ్చే సందేశాలు సాధారణంగా వెన్నుపాములోని న్యూరాన్లకు (దిగువ మోటార్ న్యూరాన్లు) ప్రసారం చేయబడతాయి. అక్కడి నుంచి, సందేశాలు శరీరంలోని కండరాలకు చేరి, అవి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. 

కండరాలు దిగువ మోటార్ న్యూరాన్ల నుంచి సందేశాలను అందుకోలేనప్పుడు, అవి బలహీనపడి కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా, దిగువ మోటార్ న్యూరాన్లు ఎగువ మోటార్ న్యూరాన్ల నుంచి సంకేతాలను అందుకోలేనప్పుడు, కండరాలు బిగుసుకుపోతాయి, దీనివల్ల స్వచ్ఛంద కదలికలు నెమ్మది నెమ్మదిగా కష్టంగా మారతాయి.

కాలక్రమేణా, రోగి నడిచే సామర్థ్యాన్ని లేదా శరీర కదలికలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. మోటార్ న్యూరాన్ వ్యాధులకు ప్రస్తుతం ఎలాంటి నివారణ లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంతకంతకు తీవ్రమయ్యే వ్యాధి కాబట్టి, కాలక్రమేణా దీని తీవ్రత పెరుగుతుంది.

అయితే, కొన్ని చికిత్సలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై ప్రభావాన్ని తగ్గించగలవు, కానీ మోటార్ న్యూరాన్లు వారాలు, నెలల తరబడి క్షీణిస్తూనే ఉంటాయి, చివరికి రోగిని అంగవైకల్యానికి గురిచేసి, మరణానికి దారితీస్తాయి.

మోటార్ న్యూరాన్ వ్యాధుల లక్షణాలు

MND లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అవి క్రమంగా పెరగవచ్చు. 
మాటలు తడబడటం
కాళ్ళలో బలహీనత
కండరాలు అదరడం
బరువు తగ్గడం
పట్టు బలహీనపడటం
అసంకల్పితంగా ఏడవడం లేదా నవ్వడం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బంది
నిద్రకు భంగం కలగడం
ఊపిరి ఆడకపోవడం
గందరగోళం
పదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్ రావడం
ఉదయం పూట తలనొప్పి
అలసట

వాస్తవానికి ఈ వ్యాధికి కచ్చితమైన లక్షణం అంటూ ఉండదని చెబుతున్నారు నిపుణులు. కాలక్రమేణా మోటార్ న్యూరాన్లు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయని పరిశోధనల్లో వెల్లడైందని చెబుతున్నారు నిపుణులు. MND వంశపారంపర్యంగా రావచ్చు, అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించవచ్చు. ఒకే ఒక్క జన్యు మార్పు కూడా ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావడానికి కారణం కావచ్చు.

MND సాధారణంగా 60 మరియు 70 ఏళ్ల వయస్సు గల వారిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్కోసారి ఇది పెద్దలు పిల్లలను కూడా ప్రభావితం చేయగలదు. ఒక వ్యక్తికి దగ్గరి బంధువుకు ఈ వ్యాధి లేదా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అనే సంబంధిత రుగ్మత ఉంటే, ఆ వ్యక్తికి MND వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

(చదవండి: నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్‌: మెరిసే చర్మం కోసం..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement