ప్రధాని మోదీ సభలో దొంగల హల్‌చల్‌ | 450 BJP workers lose phones at Modi's own rally | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ సభలో దొంగల హల్‌చల్‌

Apr 11 2026 11:07 AM | Updated on Apr 11 2026 11:28 AM

450 BJP workers lose phones at Modi's own rally

అసన్‌సోల్‌: అది పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన భారీ బహిరంగ సభ... ఒక పక్క ఉత్సాహం, మరో పక్క ఊహించని షాక్.. దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రధాని సభలో  దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 450 మందికి పైగా బీజేపీ కార్యకర్తల మొబైల్ ఫోన్లు, పర్సులు, బంగారు గొలుసులు మాయం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమే కాకుండా, బెంగాల్‌లో  రాజకీయ దుమారానికి దారితీసింది.

అసన్‌సోల్‌లోని పోలో గ్రౌండ్‌లో గురువారం జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఇదే అదనుగా భావించిన కొందరు దొంగలు జనంలో కలిసిపోయి తమ చేతివాటం ప్రదర్శించారు. కంగుతిన్న బీజేపీ కార్యకర్తలు దాదాపు 10 మంది అనుమానితులను అక్కడికక్కడే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయినప్పటికీ అధికారులు వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది.

దొంగతనం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి హిరాపూర్ పోలీసులు మొదట నిరాకరించారని, కేవలం ఫోన్లు పోగొట్టుకున్నట్లు మాత్రమే ఫిర్యాదు చేయాలని తమపై ఒత్తిడి తెచ్చారని వారు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, కొన్ని ఫోన్లను రికవరీ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. సాక్షాత్తూ ప్రధాని హాజరైన సభలోనే ఇలా జరిగితే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటని ఆమె నిలదీశారు. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత మలయ్ ఘటక్ ఈ ఘటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఆ సభకు ఎలాంటి వారు వెళ్లారో ఆ దొంగతనాలను చూస్తుంటే అర్థమవుతోంది’ అంటూ ఎద్దేవా చేయడంతో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

ఇది కూడా చదవండి: మథుర విషాదం: చలించిపోయిన హేమమాలిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement