మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర సమీపంలో యమునా నదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత హృదయ విదారకమైన ఘటన అని స్థానిక పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి హేమమాలిని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఆనందంగా భజనలు చేసుకుంటూ వెళ్తున్న పడవ బోల్తా పడి 10 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. ‘మరణించిన వారి ఆత్మలకు శాశ్వత శాంతి చేకూరాలని, ఈ తీరని శోకాన్ని భరించే శక్తిని ఆ బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె ట్వీట్ చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఈ మహా విషాదం చోటుచేసుకుంది. మథుర డీఐజీ శైలేష్ కుమార్ పాండే తెలిపిన వివరాల ప్రకారం సుమారు 30 మంది భక్తులతో వెళ్తున్న ఒక మోటారు బోటు అదుపుతప్పి పాంటూన్ వంతెనను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన 22 మందిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారికోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి
ఈ ప్రమాదానికి కనీస అనుమతులు లేని పడవ ప్రయాణమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మథుర, బృందావన్, గోకులం మధ్య బోటు ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి దీన్ని నడిపినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు పడవలో భక్తులు భక్తిపారవశ్యంతో భజనలు చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా?


