అసెంబ్లీ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ ఎన్నికల సంగ్రామం పైకి పాత కథలాగే కనిపిస్తున్నా, లోపల మాత్రం అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు సంక్షేమం, ప్రాంతీయ అస్తిత్వం నినాదంతో మమతా బెనర్జీ.. మరోవైపు జాతీయ నాయకత్వం, బెంగాల్ మార్పు నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యే నెలకొంది. అయితే గత ఎన్నికల్లో భారీ విజయానికి కారణంగా నిలిచిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దీదీ పక్కన లేరు. ఆయన మార్క్ వ్యూహాలు లేకుండా తృణమూల్ తిరిగి కాషాయ దళాన్ని నిలువరించగలదా? ఇదే ఇప్పుడు బెంగాల్ నుంచి ఢిల్లీ పీఠం వరకూ ఉత్కంఠ రేపుతున్న ప్రధాన ప్రశ్న.
భవానీపూర్‌లో హై ఓల్టేజ్
2026, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ఈ అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. మొత్తం 294 స్థానాలకు గానూ 291 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేరుగా పోటీ చేస్తుండగా, మిగిలిన మూడు డార్జిలింగ్ హిల్ సీట్లను తన మిత్రపక్షమైన బీజీపీఎంకు కేటాయించింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మరోసారి హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమయ్యారు. సువేందు అదనంగా తన పాత స్థానమైన నందిగ్రామ్ నుంచి కూడా పోటీకి దిగడం విశేషం.
వ్యూహాన్ని మార్చిన బీజేపీ
మార్చి 17న వెలువడిన టీఎంసీ అభ్యర్థుల జాబితాలో మధుజ, మదన్ మిత్ర, ఫిర్హాద్ హకీమ్ లాంటి సీనియర్ నేతలకు చోటు దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ఏకంగా 52 మంది మహిళలకు, 95 మంది ఎస్సీ, ఎస్టీలకు దీదీ అవకాశం కల్పించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేము కచ్చితంగా 226 కు పైగా సీట్లు సాధిస్తాం’ అని మమతా బెనర్జీ అత్యంత ధీమాగా చెబుతున్నారు. మరోవైపు, 2021లో ‘200 పార్’ నినాదంతో బరిలోకి దిగి వెనుకబడిన బీజేపీ, ఈసారి వ్యూహాన్ని మార్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతా సభలో మాట్లాడుతూ ‘మేము ఒకదాని తర్వాత ఒకటిగా 170 సీట్లు గెలుచుకుంటాం, ఆ తర్వాతే బెంగాల్‌లో అసలైన మార్పు వస్తుంది’ అని సవాల్ విసిరారు.
సంక్షేమ పథకాల సాయంతో..
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భయం లేని బెంగాల్’ నినాదంతో పట్టణ, హిందూ మెజారిటీ ప్రాంతాల్లో బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ ప్రధానంగా శాంతిభద్రతల సమస్యలు, నిరుద్యోగంపై అధికార పార్టీని బీజేపీ నిలదీస్తోంది. దానికి ధీటుగా టీఎంసీ ‘లక్ష్మీర్ భండార్’ వంటి ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ఓటర్ల జాబితా సవరణలను దీటుగా ఎదుర్కొనేందుకు తమ బూత్ స్థాయి ఏజెంట్లను తిరిగి చురుగ్గా రంగంలోకి దించింది. రెండు దశల్లోనే ఎన్నికలు ఉండటంతో, ఇరు పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.
కుదిపేసిన బొగ్గు కుంభకోణం
ఎన్నికల ప్రచారం ఊపందుకోకముందే, జనవరి నెలలో జరిగిన ఒక నాటకీయ పరిణామం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. 2020 నాటి బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి కోల్‌కతాలోని ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయాలతో పాటు, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. అయితే, తమ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల రహస్య డేటాను దొంగిలించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కక్షపూరితంగా ఈ దాడులు చేయిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏకంగా రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రాంతానికి ఆమె స్వయంగా చేరుకుని, కీలక పత్రాలను సీజ్ చేయకుండా ఈడీ అధికారులను అడ్డుకున్నారు. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించి, కోల్‌కతాలో భారీ నిరసన చేపట్టారు.
నాడు ఐ-ప్యాక్ అండతో..
అయితే విచారణకు ఆటంకం కలిగించారని ఈడీ ఆరోపించగా, ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈడీ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరించాల్సి వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 38 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న బీజేపీ గట్టి పోటీనిచ్చినా, 213 సీట్లతో దీదీ తన ఆధిపత్యాన్ని ,చెక్కుచెదరనీయలేదు. ఆ చారిత్రక విజయంలో ప్రశాంత్ కిషోర్‌తో పాటు, ఆయన సంస్థ ఐ-ప్యాక్ పోషించిన పాత్ర అసాధారణం. ‘దీదీ కే బోలో’ లాంటి వినూత్న కార్యక్రమాలను కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయి సమస్యలను ప్రణాళికాబద్ధంగా గుర్తించి వాటిని ప్రభుత్వ విధానాలుగా, హామీలుగా మార్చడంలో ఐ-ప్యాక్ ఒక పటిష్టమైన డేటా వ్యవస్థలా పనిచేసింది.
ఏం జరగనుంది?.. సర్వత్రా ఉత్కంఠ
అయితే ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో సొంతంగా ‘జన్ సురాజ్ పార్టీ’ పెట్టుకుని రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. (ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు). ఈ 2026 ఎన్నికల్లో ఐ-ప్యాక్ ఇప్పటికీ టీఎంసీకి వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతున్నప్పటికీ, గత ఎన్నికల్లో పీకే స్వయంగా నడిపించిన ఆ పదునైన వ్యూహాత్మక యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా కనిపించడం లేదు. ఈ లోటు ఎన్నికల ఫలితాలపై ఎంతగా ప్రభావం చూపుతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ లాంటి దిగ్గజ వ్యూహకర్త నేరుగా లేకపోయినా, ఐ-ప్యాక్ మద్దతుతో పాటు, తనకున్న సొంత ఇమేజ్, పటిష్టమైన సంక్షేమ పథకాలతో మమతా బెనర్జీ ఈ మహా పోరును మరోసారి తనవైపు తిప్పుకుంటారో లేదో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన!


