టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన! | OpenAI pushes for four day work week | Sakshi
Sakshi News home page

టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన!

Apr 8 2026 11:05 AM | Updated on Apr 8 2026 11:19 AM

OpenAI pushes for four day work week

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)మన ఉద్యోగాలను లాగేసుకుంటుందని భయపడుతున్నారా? అయితే మీకు ఓ శుభవార్త.. ఏఐ పుణ్యమా అని భవిష్యత్తులో మనం వారానికి కేవలం నాలుగు రోజులు పని చేస్తే సరిపోవచ్చు. ఏమాత్రం జీతం తగ్గకుండా, పెరిగిన పని సామర్థ్యాన్ని ఉద్యోగులకు అదనపు సమయం రూపంలో ఇవ్వాలని చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’ (OpenAI) తన సంచలన నివేదికలో ప్రభుత్వాలకు సూచించింది.

‘ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ ది ఇంటెలిజెన్స్ ఏజ్: ఐడియాస్ టు కీప్ పీపుల్ ఫస్ట్’ అనే 13 పేజీల నివేదికలో ఓపెన్ ఏఐ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏఐ వల్ల పనులు వేగంగా జరుగుతున్నందున, ఆ లాభాన్ని సమాజం అంతా పంచుకోవాలని పేర్కొంది. ఇందులో ప్రధానంగా 32-గంటల, నాలుగు రోజుల పని దినాల విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సూచించింది. ముఖ్యంగా ఇలా పని దినాలు తగ్గించినా ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించకూడదని స్పష్టం చేసింది.

గతంలో గంటల కొద్దీ పట్టే పనులను ఏఐ ఇప్పుడు నిమిషాల్లో పూర్తి చేస్తోంది. భవిష్యత్తులో నెలల తరబడి చేసే ప్రాజెక్టులను కూడా ఏఐ చాలా తక్కువ సమయంలో చేస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. ఇలా ఆదా అయిన సమయాన్ని, పెరిగిన ఉత్పాదకతను అనుసరించి ఉద్యోగులకు బెనిఫిట్స్ బోనస్‌లు ఇవ్వాలని, లేదా అదనపు పెయిడ్ లీవ్‌లు మంజూరు చేయాలని ఓపెన్ ఏఐ యాజమాన్యాలను కోరుతోంది. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు వ్యక్తిగత సమయం కూడా దొరుకుతుందని వివరించింది.

కేవలం పని గంటల తగ్గింపు మాత్రమే కాదు, ఏఐ కారణంగా వస్తున్న ఆర్థిక లాభాల్లో సామాన్యులకూ వాటా దక్కేలా ‘పబ్లిక్ వెల్త్ ఫండ్’ ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ మరో కీలక ప్రతిపాదన చేసింది. విధాన నిర్ణేతలు, ఏఐ కంపెనీలు కలిసి ఈ ఫండ్‌ను అభివృద్ధి చేయాలని, ఇందులో వచ్చే లాభాలను ప్రజలందరికీ పంచడం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని పేర్కొంది. ఏఐ రాకతో పని విధానం పూర్తిగా మారనుందని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఏఐ ఫలాలను అందుకునేలా ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ నివేదిక తేల్చి చెప్పింది.

ఇది కూడా చదవండి: అస్సాం: అగ్గి రాజేస్తున్న 40 ఏళ్ల నాటి ఒప్పందం

Advertisement
 
Advertisement
Advertisement