‘దీదీ’కి మైండ్‌ బ్లాంక్‌.. బెంగాల్‌ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం | BJPs Bengal roadmap 5 major takeaways | Sakshi
Sakshi News home page

‘దీదీ’కి మైండ్‌ బ్లాంక్‌.. బెంగాల్‌ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం

Apr 11 2026 12:37 PM | Updated on Apr 11 2026 12:51 PM

BJPs Bengal roadmap 5 major takeaways

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచార హోరును మరింతగా పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన ‘సంకల్ప్ పత్ర’ (మేనిఫెస్టో)ను తృణమూల్ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా రూపొందించారు. ముఖ్యంగా మహిళలు, యువతను ఆకర్షించడంతో పాటు, బెంగాలీ సంస్కృతిని కాపాడేలా బీజేపీ చేసిన హామీలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. బీజేపీ మేనిఫెస్టోలోని ఐదు ప్రధాన అంశాలు ఇవే..

చొరబాట్లపై ఉక్కుపాదం
అక్రమ చొరబాట్లను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన బీజేపీ.. చొరబాటుదారులను గుర్తించి, దేశం నుంచి పంపించే (డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్) విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని తీసుకువస్తామని, అలాగే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌లను అరికట్టేందుకు కఠిన చట్టాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది.

మహిళలకు పెద్ద పీట
మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ నజరానాలు ప్రకటించింది. టీఎంసీ ప్రభుత్వం ఇస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ సాయం కంటే దాదాపు రెట్టింపుగా ప్రతి మహిళకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, 75 లక్షల మందిని ‘లఖ్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది.

యువతకు ఉపాధి
నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కమలనాథులు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో  కోటి కొత్త ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 5 లక్షల మంది యువతకు చెరో రూ.10 లక్షల ఆర్థిక సాయం (సగం గ్రాంట్, సగం వడ్డీ లేని రుణం) అందించనున్నామని తెలిపారు.

బెంగాలీ సంస్కృతి పరిరక్షణ
తమను బయటి వ్యక్తులుగా ముద్రవేస్తున్న టీఎంసీ వాదనను తిప్పికొడుతూ.. బెంగాలీ ఆత్మగౌరవాన్ని కాపాడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వందేమాతరం మ్యూజియం, ఠాగూర్‌ కల్చరల్ సెంటర్ల ఏర్పాటుతో పాటు అన్ని శక్తిపీఠాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధి
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ.. తాజ్‌పూర్, కుల్పిలో ఆధునిక డీప్-సీ పోర్టులను నిర్మిస్తామని బీజేపీ తెలిపింది. సుందర్‌బన్స్ నుండి డార్జిలింగ్ వరకు నేరుగా జాతీయ రహదారితో పాటు, ఉత్తర బెంగాల్‌లో నాలుగు కొత్త నగరాల నిర్మాణాన్ని తమ ‘సంకల్ప్ పత్ర’లో ప్రముఖంగా పొందుపరిచింది.

ఇది కూడా చదవండి: ‘కుంభమేళా మోనాలిసా’ పెళ్లి.. చిక్కుల్లో సీపీఎం నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement