ఆంటీ అనకూడదు | Woman wins UK case over being called Aunty at work | Sakshi
Sakshi News home page

ఆంటీ అనకూడదు

Apr 9 2026 9:06 AM | Updated on Apr 9 2026 9:43 AM

Woman wins UK case over being called Aunty at work

పేరుతో పిలవాలని చెప్పినా ఉద్దేశపూర్వకంగా ఆంటీ అని పిలిచారు

ఘనా మూలాలున్న నర్సును మందలించిన కోర్టు 

పరువునష్టం కేసు గెలిచిన భారతీయురాలు

లండన్‌: తనను ఆంటీ అని పిలవడం సుతరామూ ఇష్టంలేదని ఎన్నోసార్లు చెప్పినా పదేపదే అదే పదంతో పిలిచి ఇబ్బంది పెట్టిందంటూ ఘనామూలాలున్న నర్సుపై పెట్టిన పరువునష్టం దావాలో భారతీయమూలా లున్న మహిళ బ్రిటన్‌ కోర్టులో విజయం సాధించింది. ‘‘61 ఏళ్ల ఇల్డా ఎస్టీవ్స్‌ మనో భావాలు దెబ్బతిన్నాయి. పరువునష్టం కింద 1,425.15 బ్రిటన్‌ పౌండ్ల(దాదాపు రూ.1,76,700)ను ఆమెకు వెస్ట్‌ లండన్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ విభాగం తక్షణం చెల్లించాలి’’ అని యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య కేసులను విచారించే వాట్‌ఫోర్డ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి జార్జ్‌ ఎలియోట్‌ తీర్పు చెప్పారు. 

ఈ కేసు వాదోపవాదనలు గత ఏడాది పూర్తికాగా గత నెలలో వివరణాత్మక తీర్పును వెలువర్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వదేశంలో వయోధికులను గౌరవసూచకంగా ఆంటీ అని పిలవడం ఆనవాయితీగా వస్తోందని ఘనా దేశస్తురాలైన ఛార్లెస్‌ ఒపోంగ్‌ అనే మహిళా నర్సు చేసిన వాదనలను ముగ్గురు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఇల్డా ఎస్టీవ్స్‌ వయసు 61 ఏళ్లు. అయినాసరే ఆమెకు ఆంటీ అని పిలవడం ఇష్టంలేదు. ఆ విషయం ఆమె నీకు చాలా సార్లు చెప్పింది. పేరుతోనే పిలవాలని సూచించింది. 

అయినా నువ్వు పదేపదే పనిగట్టుకుని ఆంటీ అని పిలిచావు. తన డ్యూటీ సమయం అయిపోయాక నీకు బాధ్యతలు అప్పగించేటప్పుడు, కారిడార్లలో అదేపనిగా ఆంటీ ఆంటీ అని పిలిచావు. అది ఇల్డాకు ఏమాత్రం నచ్చలేదు. నీ మాటలు ఆమెను గాయపరిచాయి. పనివాతావరణాన్ని నువ్వు కాస్తంత పాడుచేశావు’’ అని ధర్మాసనం ఛార్లెస్‌ ఒపోంగ్‌ను మందలించింది. ఈమె ప్రవర్తనకు ఎన్‌హెచ్‌ఎస్‌దే పరోక్ష బాధ్యత. అందుకే ఈ పరువునష్టం చెల్లింపును ఎన్‌హెచ్‌ఎస్‌ చెల్లించాల్సిందే’’ అని కోర్టు చెప్పింది. అయితే జాత్యహంకారం, ఉద్దేశపూర్వకంగా వేతనంలో కోత వంటి ఆరోపణలను మాత్రం కోర్టు కొట్టేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement