న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్’ తాజా ప్రదర్శన సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. చాలా ఏళ్ల తర్వాత సభ్యులంతా కలిసి సియోల్‌లోని గొయాంగ్ స్టేడియంలో మొదలుపెట్టిన ‘అరిరాంగ్’ వరల్డ్ టూర్ 2026 అట్టహాసంగా ప్రారంభమైనప్పటికీ, ఒక చిన్న వీడియో క్లిప్ వారి గాత్రంపైనే అనుమానాలు పెంచుతోంది. వారు నిజంగా పాడుతున్నారా లేదా కేవలం లిప్ సింక్ చేస్తున్నారా? అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఏప్రిల్ 9న జరిగిన ఈ లైవ్ కాన్సర్ట్‌ను ‘వీవర్స్’ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేశారు. కళ్లు చెదిరే స్టేజ్ డిజైన్, అద్భుతమైన కొరియోగ్రఫీతో షో అదరగొట్టింది. కానీ జంగ్‌కూక్, వీ, జిన్ కలిసి ‘బాడీ టు బాడీ’ పాటలోని ‘సమ్‌బడీ లైక్ యు’ అనే సెగ్మెంట్ పాడుతున్న సమయంలో తీసిన వీడియో వివాదానికి దారి తీసింది. జిన్ పాడుతున్న వాయిస్‌కి, అతని చేతిలోని మైక్ కదలికలకు అస్సలు పొంతన లేకపోవడంతో కొందరు నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. ‘బ్యాక్‌గ్రౌండ్ ట్రాక్ ప్లే చేసినా పర్వాలేదు, కానీ లైవ్‌లో పాడుతున్నట్లు ఎందుకు నటిస్తున్నారు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
Here is the video https://t.co/zLd6uNwmQL pic.twitter.com/z66bbV0S8b
— T🎭 (@Wakeazul) April 9, 2026
ఈ విమర్శలపై బీటీఎస్ అభిమానులు (ఆర్మీ) అంతే ధీటుగా స్పందించారు. వైరల్ అవుతున్న వీడియోను కావాలనే తప్పుగా ఎడిట్ చేశారని మండిపడుతున్నారు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో వీవర్స్ యాప్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఆడియో, వీడియో మధ్య మిల్లీసెకన్ల తేడా వచ్చిందని ఆధారాలతో సహా వివరిస్తున్నారు. స్టేజి మీద వాళ్లు పాడుతున్నప్పటికీ, స్క్రీన్ మీద టెలికాస్ట్ అయ్యేసరికి ఆ జాప్యం కనిపించిందని చెబుతున్నారు.
స్టేడియంలో నేరుగా రికార్డ్ చేసిన ఒరిజినల్ ఫ్యాన్‌క్యామ్ వీడియోల్లో వారి వాయిస్ స్పష్టంగా ఉందని, వేరే స్ట్రీమింగ్ వీడియోలను చూసి, తప్పుగా అర్థం చేసుకోవద్దని ఫ్యాన్స్ గట్టిగా వాదిస్తున్నారు. ఈ వివాదం ఆన్‌లైన్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన తారలకు అండగా నిలుస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం


