బలగమే బలం! | - | Sakshi
Sakshi News home page

బలగమే బలం!

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

బలగమే బలం!

కడవరకూ తోడుండేది వారే

ఎక్కడ ఉన్నా అప్పుడప్పుడైనా

కలిసేందుకు ప్రయత్నిస్తున్న పలువురు..

నేడు తోబుట్టువుల దినోత్సవం

మ్మడి కుటుంబ వ్యవస్థలో ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నామనే ధైర్యం ఇచ్చేవారు. తనకు కుటుంబం ఉందన్న ధైర్యం ఉండేది. దీంతో అప్పట్లో ఎవరూ ఆత్మహత్యల ఆలోచనలు చేసేవారు కాదు. అలాగే కుటుంబంలో పెద్దలను చూసి పిల్లలు నడవడిక, బాధ్యతలు, కుటుంబ విలువలు తెలుసుకునేవారు. పండగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లప్పుడైతే ఇంటిళ్లిపాది ఎంతో ఆనందంగా గడిపేవారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. చిన్న కుటుంబాలుగా మారిపోయిన తర్వాత ఏదైనా సమస్య ఎదురైనపుడు ధైర్యం చెప్పేవారు కరువయ్యారు. కష్టమైనా, బాధ అయినా ఓదార్పు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యల బాట పడుతున్నారు.

కలిసి ఉండాలనే ఆరాటం..

ఉద్యోగ రీత్యానో.. ఉపాధి అవకాశాల కోసమో.. వ్యాపార నిమిత్తమో స్వగ్రామాలను విడిచి పట్టణాలు, నగరాలకు వలస వెళ్లడం తప్పనిసరిగా మారిపోయింది. ఇలా ఎక్కడెక్కడో ఉంటున్నా కొందరు బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పండుగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఒక్క చోటుకు చేరుతున్నారు. విభేదాలు తలెత్తినా వాటిని పరిష్కరించుకుంటూ కలిసి ఉందామనే ఆలోచనలు చేస్తున్నారు. దీంతో కొన్ని కుటుంబాల్లో పాత రోజులు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లన్నింటినీ కలిపి గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పలకరించుకుంటున్నారు. పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం.. వీలైతే అందరూ వెళ్లి కేక్‌ కట్‌ చేసి కలిసి భోజనాలు చేయడం ద్వారా బంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తల్లిదండ్రులు జన్మనిస్తే.. తోడబుట్టిన వారు తోడు, నీడగా జీవితాంతం ఉంటారు. కష్ట సుఖాల్లో భాగమవుతారు. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి.. ఎవరైనా ఒకరు మనకు తోడుగా ఉంటే ఆ ధైర్యమే వేరు.. గతంలో ఉమ్మడి కుటుంబాలే కనిపించేవి. రెండు మూడు తరాల వారు కూడా కలిసి సంతోషంగా ఉండేవారు. కానీ నేటి సమాజంలో చిన్నచిన్న విషయాలకే మనస్పర్థలు పెంచుకుని బంధాలను తెంచుకుంటున్నారు. ఆస్తుల విషయంలో అంతు చూసేదాకా వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని కుటుంబాల్లో ఒకరికి ఒకరుగా నిలుస్తుండడం విశేషం. శుక్రవారం తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement