దోమకొండ మండల కేంద్రానికి చెందిన బత్తిని గుండవ్వ, విఠల్ దంపతులకు ముగ్గురు కుమారులు. విఠల్ పాతికేళ్ల కిందటే చనిపోగా తల్లి, ముగ్గురు కొడుకులు, వారి కుటుంబంలోని 14 మంది కలిసే ఉంటున్నారు. సిద్దరాములు, గురుమూర్తి, గంగాధర్‌లు ముగ్గురు కలిసి వస్త్ర దుకాణం నిర్వహిస్తారు. సిద్దరాములుకు భార్య, కొడుకు, కూతురు, గురుమూర్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు, గంగాధర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలందరూ ఉన్నత చదువులతో ముందుకు వెళుతున్నారు. ఒకరిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. అందరం కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని పెద్దకుమారుడైన సిద్దరాములు పేర్కొంటున్నారు.


