గేటు కష్టాలు.. ఇంకెన్నాళ్లు! | - | Sakshi
Sakshi News home page

గేటు కష్టాలు.. ఇంకెన్నాళ్లు!

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

గేటు కష్టాలు.. ఇంకెన్నాళ్లు!

సర్వేలకే పరిమితం..

కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌ రైల్వే గేటు వద్ద నిలిచి ఉన్న వాహనాలు

జిల్లాకేంద్రం మీదుగా రోజూ అరవైకిపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి లేకపోవడంతో రైలొచ్చే ముందే గేటు వేస్తారు. బండి వెళ్లిపోయిన కొద్ది సేపటి తర్వాత తీస్తారు. దీంతో రైలొచ్చినప్పుడల్లా వాహనదారులు పది నిమిషాలపైనే గేటు వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. క్రాసింగ్‌ ఉంటే అరగంట పాటు ఆగాల్సిందే.. దశాబ్దాలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు తీరడం లేదు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణాన్ని రైల్వే లైన్‌ రెండుగా చీలుస్తుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రోజూ తిరిగేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వంతెనపై నుంచి వెళ్లాలంటే పోలీసుల వాహనాల తనిఖీలు, రెండు చోట్ల సిగ్నల్స్‌, భారీ ట్రాఫిక్‌ ఇబ్బంది కలిగిస్తాయి. దీంతో చాలా మంది అశోక్‌నగర్‌ రైల్వే గేటు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవారంతా ఈ దారినే ఉపయోగిస్తారు. అలాగే కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయాలకు ఈ దారిలోనే వెళ్లాలి.

పెరిగిన రైళ్ల రాకపోకలు..

కామారెడ్డి రైల్వే స్టేషన్‌ మీదుగా రైళ్ల రాకపోకలు పెరిగాయి. ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య దాదాపు 60 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి నిజామాబాద్‌, నాందేడ్‌తో పాటు దూర ప్రాంతాలకు ఎన్నో రైళ్లు తిరుగుతాయి. అలాగే అటు వైపు నుంచి సికింద్రాబాద్‌కు, విశాఖ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు రైళ్లు నడుస్తాయి. గూడ్స్‌ వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ప్రతి ఇరవై నిమిషాలకోసారి గేటు వేయాల్సి వస్తోంది. రైలు వెళ్లేంతవరకు సుమారు పది నిమిషాలపైనే గేటును మూసి ఉంచాల్సి రావడంతో ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు పెరుగుతున్నాయి. ఒకవేళ రైళ్ల క్రాసింగ్‌ ఉందంటే అరగంట పాటు నిరీక్షించాల్సిందే.. అత్యవసర పరిస్థితుల్లో చాలాసార్లు గేటు వల్ల ఇబ్బందులు పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. అయితే ఇది కలగానే మిగిలి ఉంది. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వే మంత్రితో పాటు ఇతర మంత్రులను కలిసి ఇక్కడ వంతెన నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు రైల్వే ఉన్నతాధికారులు సర్వేలు కూడా చేయించారు. అలాగే జిల్లా కేంద్రంలో ఆర్‌బీ నగర్‌ ప్రాంతంలో ఒకటి, పాత జాతీయ రహదారిపై పాత రాజంపేట వద్ద మరో వంతెన కోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు చేశారు. మూడు వంతెనలు వస్తాయని ఆయన ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకై తే ఒక్కదానికీ మంజూరు లభించలేదు. వంతెనలు నిర్మిస్తేనే ట్రాఫిక్‌ కష్టాలు తీరే అవకాశాలున్నాయి.

రోజూ అరవైకిపైనే రైళ్ల రాకపోకలు

బండొచ్చినప్పుడల్లా

పది నిమిషాలు ఆగాల్సిందే

క్రాసింగ్‌ ఉంటే అరగంట

నిరీక్షించాల్సిన పరిస్థితి

జిల్లా కేంద్రంలో అవస్థలు

పడుతున్న ప్రజలు

వంతెన నిర్మించాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement