ఓపిక పట్టాలి! | Kumble hints to fans about Vaibhav Suryavanshis place in the Indian senior team | Sakshi
Sakshi News home page

ఓపిక పట్టాలి!

Apr 11 2026 2:42 AM | Updated on Apr 11 2026 2:42 AM

Kumble hints to fans about Vaibhav Suryavanshis place in the Indian senior team

భారత సీనియర్‌ జట్టులో వైభవ్‌ సూర్యవంశీకి చోటుపై అభిమానులకు కుంబ్లే సూచన   

ముంబై: ఐపీఎల్‌లో మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్‌ సూర్యవంశీపై మరింత ఒత్తిడి పెంచడం సరికాదని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్‌ కుంబ్లే అన్నాడు. 15 ఏళ్ల కుర్రాడిని అలా అతడి ఇష్టానికి వదిలేయాలని ఇప్పటి నుంచే అతడి మనసులో జాతీయ సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఒత్తిడిని నింపొద్దని ఈ స్పిన్‌ దిగ్గజం హితవు పలికాడు. ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ సచిన్‌ టెండూల్కర్‌ కూడా టీనేజ్‌ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి... ఆ తర్వాత బ్యాటింగ్‌ లెజెండ్‌గా ఎదగగా... ఇప్పుడు ఆ అవకాశం సూర్యవంశీకి ఉందని పలువురు విశ్లేషిస్తున్న నేపథ్యంలో కుంబ్లే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

‘అసాధారణ ప్రతిభ గల వైభవ్‌ సూర్యవంశీ దూకుడును ఆపడం కష్టతరమే. అయితే తొందరపాటు అంచనాలు యువ క్రీడాకారుడిపై అనవసర ఒత్తిడి పెంచుతాయి. ఈ వయసులోనే అతడు చక్కగా ఆడుతున్నాడు. అయితే మరో రెండు నెలల్లో నువ్వు టీమిండియాకు ఆడాలి అని చెప్పడం మాత్రం అతడిపై కచ్చితంగా ఒత్తిడి పెంచుతుంది. మరో పదేళ్ల తర్వాత కూడా వైభవ్‌ వయసు ఇంకా పాతికేళ్లే ఉంటుంది’ అని కుంబ్లే అన్నాడు. 

క్రికెట్‌లో విజయవంతం కావడానికి ఒక నిర్దిష్టమైన మార్గం అంటూ ఏదీ లేదని... నిరంతరం శ్రమిస్తూ ఎప్పటికప్పుడు మెరుగవుతూ ముందుకు సాగితే ఫలితాలు అనుకూలంగా వస్తాయని కుంబ్లే పేర్కొన్నాడు. ‘ఈ ఏడాదో, వచ్చే ఏడాదో అతడి పేరు సెలెక్టర్ల పరిశీలనకు రావడం ఖాయం. ఇప్పటికే అతడి ఆటతీరును అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. కాస్త ఓపిక పట్టడం ముఖ్యం’ అని వివరించాడు.  

క్రీడా సంస్కృతి పెరగాలి... 
భారత్‌కు ఒలింపిక్స్‌ ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కితే అది దేశ క్రీడారంగంలో కీలక మలుపుగా నిలుస్తుందని కుంబ్లే అన్నాడు. మౌలిక వసతులు పెంపొందడంతో పాటు... కొత్త తరం అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘భారీ క్రీడా పోటీలతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. 1982లో జరిగిన ఆసియా క్రీడలు నాపై చాలా ప్రభావం చూపాయి. దీంతో దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందుతుంది’ అని కుంబ్లే అన్నాడు. ఏదో ఒక రోజు భారత ఫుట్‌బాల్‌ జట్టు కూడా ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొంటుందని జంబో ఆశాభావం వ్యక్తం చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement