మెగా శనివారం.. ఒకేరోజు బరిలో మోదీ, మమత, షా.. | Mega Saturday showdown Modi Mamata Shah Abhishek flex power | Sakshi
Sakshi News home page

మెగా శనివారం.. ఒకేరోజు బరిలో మోదీ, మమత, షా..

Apr 11 2026 1:04 PM | Updated on Apr 11 2026 1:15 PM

Mega Saturday showdown Modi Mamata Shah Abhishek flex power

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఏప్రిల్‌ 11.. శనివారం.. ‘మెగా శనివారం’గా మారింది. నేడు బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక మహా ఘట్టంగా నిలిచిపోనుంది. ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ సత్తా చాటేందుకు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఈ నలుగురు అగ్ర నేతల రాకతో బెంగాల్ ఎన్నికల వాతావరణం దద్దరిల్లుతోంది. తూర్పు బర్ధమాన్ జిల్లాలోని కల్నా సమీపంలోని సిమ్లాన్ వద్ద ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం కల్నా-బర్ధమాన్ స్టేట్ హైవే పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో భారీ వేదికను సిద్ధం చేశారు. భద్రత కోసం వేదిక పరిసరాలను సీసీటీవీ నిఘాలోకి తీసుకురావడంతో పాటు, హెలికాప్టర్ ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. ఈ సభకు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నారని, ప్రతిపక్ష శిబిరాల నుంచి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భౌమిక్ తెలిపారు.

మరోవైపు బంకురా జిల్లా ఈరోజు ఒకేసారి రెండు ప్రధాన పార్టీల బలప్రదర్శనకు వేదిక కానుంది. బర్జోరా కాలేజ్ గ్రౌండ్స్‌లో సీఎం మమతా బెనర్జీ భారీ ఎన్నికల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని టీఎంసీ నాయకులు తెలిపారు. ఇదే జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒండాలోని రామ్‌సాగర్, ఛత్నాలోని ఝాటిపహాడీ వద్ద రెండు వేర్వేరు సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో పాటు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కూడా గంగాజల్‌ఘటిలో బీజేపీ అభ్యర్థి బిల్లేశ్వర్ సిన్హా తరఫున ప్రచారం చేయనున్నారు.

బీర్భూమ్ జిల్లాలోనూ రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరింది. టీఎంసీ యువ నేత అభిషేక్ బెనర్జీ సైంథియాలోని జాలీబగాన్ సమీపంలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఈ సభ కోసం భారీ వేదికతో పాటు ప్రత్యేక హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. కేవలం సైంథియా నియోజకవర్గం నుంచే 50 నుంచి 60 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక టీఎంసీ అధ్యక్షుడు దేబాశిష్ సాహా తెలిపారు. లాబ్‌పూర్, మయూరేశ్వర్, నానూర్ అభ్యర్థులతో పాటు సీనియర్ నేత అనుబ్రత మండల్ కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ అగ్ర నేతల ప్రచార పర్వం ఓటర్లను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement