● నిత్యం యోగా చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా యోగా కేంద్రంలో యోగా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాభివృద్ధి సైతం ప్రగతి ప్రణాళికలో భాగమేనన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ వైద్య విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. యోగా, ఆయుర్వేదం, హోమియోపతి లాంటి వైద్య పద్ధతులు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు జీవనశైలిని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా ఆయుష్ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు వ్యాధుల నివారణలో యోగా, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం సూక్ష్మ వ్యాయామాలు, తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం లాంటి పలు యోగాసనాలు, అనులోమ విలోమ, భ్రామరీ ప్రాణాయామాలు, ధ్యానం చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రవీందర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


