కామారెడ్డి టౌన్ : ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో రవీందర్ గౌడ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో గల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో ప్రపంచ హోమియో పతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుర్వేద, హోమియో, యునాని ఉచిత వైద్య శిబిరాన్ని 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ప్రారంభించారు. ఈ శిబిరంలో కీళ్ల నొప్పులు, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకా లిక సమస్యలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు వెంకటేశ్వర్లు, మాలికా జునైడి, నహీదా, విజయ, దేవయ్య, కిషోర్, ఫార్మసిస్టు జ్యోత్స్న, సుమలత, రాజన్న పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలతోపాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీల భర్తీకోసం 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఈవో రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ఈనెల 10 నుంచి అధికార వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పీజీ ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. సెమిస్టర్ పరీక్షల్లో అన్ని విభాగాల్లో విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణత సాధించడంపై ప్రిన్సిపల్ విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెయూ పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపల్, పరీక్షల నియంత్రణ అధికారి కిష్టయ్య, అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు రాములు, రాజేందర్ పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: నేరాల నియంత్రణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండడమే ప్రధానమని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలన్నారు. రాత్రి సమయంలో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, గస్తీ పెంచాలని, అనుమానితులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం రాజీపడరాదని, ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట డీఎస్పీ విఠల్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో శ్రీధర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
పెర్కిట్ ఉదంతంపై
కలెక్టర్ సీరియస్
నిజామాబాద్‌అర్బన్: పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిర శుక్రవారం కలెక్టర్‌ను కలిసి ఘటనను వివరించారు. మార్చి 2 నుంచి 31 వరకు బ్యూటీషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన స్నేహ.. బాలికలు, యువతుల ఫొటోలు, ఫోన్ నంబర్లను సతీశ్ అనే వ్యక్తికి పంపించిందన్నారు. దీంతో సతీశ్ కొంతమందిని వేధింపులకు గురి చేశాడని వివరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ తరహా చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని, ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, కలెక్టర్ పేర్కొన్నారు.


