‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’ | Was Told Have 3 To 6 Months Left To Live: Yuvraj Singh On Cancer Battle | Sakshi
Sakshi News home page

‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’

Apr 9 2026 4:31 PM | Updated on Apr 9 2026 4:53 PM

Was Told Have 3 To 6 Months Left To Live: Yuvraj Singh On Cancer Battle

భారత క్రికెట్‌ చరిత్రలో యువరాజ్‌ సింగ్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఐసీసీ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ (2007)లో భారత్‌ గెలవడంలో ఈ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర.

అదే విధంగా.. సొంతగడ్డపై భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2011 టైటిల్‌ గెలవడంలో యువీదే ముఖ్య భూమిక. ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అద్భుత ప్రదర్శన కారణంగా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత టీమిండియా మరోసారి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో యువీ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

ఆటకే ప్రాధాన్యం
అయితే, ఇంతటి సంతోషకర సమయంలోనే ఓ చేదు వార్త యువరాజ్‌ సింగ్‌కు తెలిసింది. తనకు క్యాన్సర్‌ సోకిందనే విషయం బయటపడింది. అదే సమయంలో టెస్టు జట్టులో యువీకి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కంటే ఆటకే ప్రాధాన్యం ఇవ్వాలని అతడు భావించాడు. అయితే, డాక్టర్‌ హెచ్చరికల తర్వాత యువీ తన నిర్ణయాన్ని మార్చుకోకతప్పలేదు.

అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్‌ సింగ్‌.. మహమ్మారిని జయించి యువరాజ్‌ సింగ్‌ మరికొన్నేళ్లు క్రికెటర్‌గా కొనసాగాడు. అయితే, చేదు అనుభవాల గురించి అతడు తాజాగా మనసు విప్పాడు. ‘‘ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకున్న వేళ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతున్నట్లు అనిపించింది.

అప్పుడు మేము ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంగూలీ రిటైర్‌ అయిన కారణంగా నాకు టెస్టు జట్టులో అప్పుడే చోటు దక్కింది. ఏడేళ్ల నిరీక్షణ ఫలించబోతున్న తరుణం. నేను చచ్చిపోయినా పర్లేదు.. ఆ స్థానం నాకు కావాల్సిందే అని మనసులో గట్టిగా అనుకున్నాను.

ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు
అయితే, అప్పుడు డాక్టర్‌ నితేశ్‌ రోహత్గి నాకో భయంకర నిజం చెప్పారు. ‘నీ గుండె, ఊపిరి తిత్తులకు మధ్య ట్యూమర్‌ ఉంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్లి క్రికెట్‌ ఆడితే గుండెపోటు వచ్చినా రావొచ్చు. కీమోథెరపీ ఇప్పుడు గనుక మొదలుపెట్టకపోతే ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం’ అని కుండబద్దలుకొట్టేశారు.

అప్పుడే నాకు సమస్య తీవ్రత అర్థమైంది. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్నా. నేనిక ఆడలేను అన్న బాధ మానసికంగా నన్ను కుంగదీసింది. కానీ అసలు క్రికెట్‌ లేకపోతే నేనెవరిని? నా గుర్తింపు ఏమిటి? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడు పాత క్రికెట్‌ వీడియోలు చూస్తూ స్ఫూర్తి పొందేవాడిని.

ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టు
నేను అమెరికాలో ఉన్నపుడు అనిల్‌ కుంబ్లే వచ్చాడు. లాప్‌టాప్‌లో మ్యాచ్‌లు చూస్తుంటే.. ‘ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టు. ఇవన్నీ పక్కన పెట్టు’ అని మందలించాడు. ఇంగ్లండ్‌లో ఉన్నపుడు సచిన్‌ పాజీ వచ్చి ‘నువ్వు త్వరలోనే కోలుకుని తిరిగి వస్తావు’ అని ధైర్యం నింపాడు’’ అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌తో యూట్యూబ్‌ చాట్‌లో యువీ పంచుకున్నాడు.
చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌.. అక్షర్‌ పటేల్‌ రియాక్షన్‌ ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement