నో మెన్‌... ఓన్లీ విమెన్‌ : 300మంది వీడియో వైరల్‌ | No men 300 women buy medieval French chateau together video goes viral | Sakshi
Sakshi News home page

నో మెన్‌... ఓన్లీ విమెన్‌ : 300మంది వీడియో వైరల్‌

Apr 11 2026 2:44 PM | Updated on Apr 11 2026 4:07 PM

No men 300 women buy medieval French chateau together video goes viral

అప్పుడప్పుడూ కిట్టీ పార్టీలు,  ఏ పార్క్‌కో,  చిన్నపాటి  తీర్థయాత్రకో వెళ్లడం తప్ప మహిళలకు పెద్దగా రిక్రియేషన్‌ ఏమీ ఉండదు. అందుకే మహిళల కోసం, మహిళల ద్వారా నిర్మితమైన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్  ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఫ్రాన్స్‌లో ఒక మధ్యయుగపు కోటను కొనుగోలు చేయడానికి సుమారు 300 మంది మహిళల ప్రయత్నం,  వీడియో ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. అదేంటో తెలుసుకుందాం.
 
ఒక చారిత్రక కట్టడాన్ని కొనుగోలు చేసి, దానిని మహిళల కోసం ఒక ప్రత్యేక హేవెన్‌గా మార్చాలనే 300 మంది మహిళల సాహసోపేతమైన ప్రయత్నం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి,  తోటి మహిళలతో కలిసి సరదాగా గడపడానికి, కొత్త ఉత్సాహం పొందేలా  దాదాపు 300 మంది మహిళలు కలిసి ఫ్రాన్స్‌లోని ఒక పురాతన మధ్యయుగ కోటను (Medieval Chateau) కొనుగోలు చేశారు. దాని పేరే 'క్యాంప్ చాటో' (Camp Chateau).

ముఖ్య విశేషాలు
మహిళలు దైనందిన ఒత్తిళ్లకు దూరంగా, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి, ఒకరితో ఒకరు అనుబంధాన్ని పంచుకోవడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఇది 100 శాతం మహిళల సొంతం. వారి నిధులతోనే నడుస్తుంది. 'ఫౌండర్ మెంబర్' అనే ప్రత్యేక మోడల్ ద్వారా దీనిని కొనుగోలు చేశారు.  

అంటే ఇక్కడ మగపురుగు కూడా ఉండదన్నట్టు.. ఉండేదంతా సిస్టర్‌ హుడ్‌. ఇక్కడ సమ్మర్ క్యాంప్స్, విశ్రాంతి గదులు, ఆన్‌లైన్ కమ్యూనిటీ ద్వారా మహిళలకు ఒక 'వర్చువల్ స్వర్గాన్ని' అందిస్తున్నారు. ఈ కోట రోజువారీ ఒత్తిళ్ల నుండి దూరంగా,ఒక స్లీప్‌ అవేలా, రిట్రీట్‌గా పనిచేస్తుంది. ఇక్కడ మహిళలు కలిసి సమయం గడపవచ్చు. అలాగే ఒక చారిత్రక ప్రదేశంలో గడిపిన అనుభూతి పొందవచ్చు.

ఈకోటలో ఎలాంటి భయాలు, ఆటంకాలు లేకుండా పచ్చని ప్రకృతి మధ్య, ఇష్టమైన నెచ్చెలులతో ఆడి పాడవచ్చు. నిస్సంకోచంగా నచ్చిన పని చేసుకోవచ్చు.  “మీరు మీ ప్రాణస్నేహితురాలు, పెద్ద కుమార్తె , మరో 300 మంది మహిళలతో కలిసి ఒక మధ్యయుగపు కోటను కొనుగోలు చేశారు. ఇప్పుడు  మీరంతా ఒకచోట చేరి, ఆలింగనం చేసుకుని, వేడుకలు జరుపుకుని, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఒక స్థలాన్ని సృష్టించారు. స్వేచ్ఛగా. ఆనందంగా. మనస్ఫూర్తిగా.” అనే క్యాప్షన్‌తో దీనికి సంబంధించిన వీడియో షేర్‌ అయింది. దీనిపై బోలెడు ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు మీ దేశంలో కూడా మీరు ఇలాంటి  కోటనొకదాన్ని ఏర్పాటు చేసుకుంటారా అనే ప్రశ్నను సంధించడం విశేషం.

నెటిజన్ల స్పందన
ఈ వైరల్‌ వీడియోపై సోషల్ మీడియా  భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చాలా మంది మహిళలు  దీన్ని "రిటైర్మెంట్ ప్లాన్" అని కొనియాడుతోంటే, "ఇది చాలా అద్భుతమైన ఆలోచన, ఇలాంటి కలయికలు, కమ్యూనిటీలు మనశ్శాంతిని ఇస్తాయి" అని  మరికొందరు వ్యాఖ్యానించారు.  ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది అని  మరి కొంతమంది ఆరా తీశారు.

మరోవైపు కొందమంది నెటిజన్లు వ్యంగ్య బాణాలు విసిరారు.  "ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు లేదా పైకప్పు కారితే ఎవరు బాగు చేస్తారు? ఖచ్చితంగా మగవారిని పిలవాల్సిందే కదా" (ఇలాంటి పనులు ఆడవాళ్లు చేయలేరు అన్నట్టు) అంటూ కొందరు ఎద్దేవా చేశారు. మరికొందరు మేల్‌ చావనిస్ట్‌లేమో ఇలాంటి ఆడోళ్లు సమాజం నుండి విడిపోవడమే మంచిది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఏది ఏమైనా "మహిళలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఉత్సాహంగా, స్వేచ్ఛగా గడిపే ఒక వేదికను సృష్టించడమే మా ఉద్దేశ్యం."  అని క్యాంప్ చాటో వెబ్‌సైట్‌ చెప్పినట్టు, ఆడవారి దుస్తులు, వేషధారణమీద  ఎలాంటి జడ్జ్‌మెంట్‌లు,   విమర్శలు, విరుపులు లేని ఒక ఉత్సాహపూరిత  క్షణాలు నిజంగానే  కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏమంటారు? 

Advertisement
 
Advertisement
Advertisement