స్టూడెంట్‌ డెత్‌ మిస్టరీ: పార్టీ చేసుకుందామని పిలిచి.. | Noida Student Death in Water Pit Turns Darker Booked For Murder | Sakshi
Sakshi News home page

స్టూడెంట్‌ డెత్‌ మిస్టరీ: పార్టీ చేసుకుందామని పిలిచి..

Apr 11 2026 9:30 AM | Updated on Apr 11 2026 9:47 AM

Noida Student Death in Water Pit Turns Darker Booked For Murder

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ నిర్మాణ స్థలంలోని నీటి గుంతలో పడి 23 ఏళ్ల హర్షిత్ భట్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తొలుత ఇదొక ప్రమాదంగా భావించినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  కేసు మరో మలుపు తిరిగింది. తన కొడుకును స్నేహితులే పథకం ప్రకారం చంపేశారని తల్లి ఆరోపణలు చేయడంతో, ఆ ముగ్గురు స్నేహితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హర్షిత్ ఇందిరాపురంలో ఉంటూ సెక్టార్ 125లోని అమిటీ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నాడు. బుధవారం (ఏప్రిల్ 8న) తన ఆరవ సెమిస్టర్ చివరి పరీక్ష రాసిన అనంతరం.. స్నేహితులు వ్యాస్, క్రిష్, హిమాన్షులతో కలిసి సెక్టార్ 94లోని సూపర్ నోవా భవనం వెనుక వైపు ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆగిపోయిన ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ స్థలంలో బేస్మెంట్ కోసం తవ్విన భారీ గుంతలో నీరు నిలిచి ఉంది. ప్రహరీ గోడ గుండా వారు లోపలికి ప్రవేశించారు.

పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో వీరంతా ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పరీక్షకు ముందు, ఆ తర్వాత కూడా వీరు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. గుంత దగ్గర బీర్ క్యాన్లు, మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో ఉన్న వీరు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆ నీటి గుంతలోకి దిగారు.

మొదట హర్షిత్ నీటిలోకి దిగాడని, ఈదుకుంటూ బురద ఎక్కువగా ఉన్న మధ్య భాగంలోకి వెళ్లి ఇరుక్కుపోయాడని స్నేహితులు చెబుతున్నారు. కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి 10 మీటర్ల లోతు నుంచి హర్షిత్ ను బయటకు తీసుకువచ్చి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతన్ని ఆ ముగ్గురే ఉద్దేశపూర్వకంగా చంపేశారని తల్లి దీప్ మాల సెక్టార్ 126 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు  ఈ కేసును హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మథుర విషాదం: చలించిపోయిన హేమమాలిని

Advertisement
 
Advertisement
Advertisement