తల్లి దారుణహత్య! పాపం చిన్నారి.. | - | Sakshi
Sakshi News home page

తల్లి దారుణహత్య! పాపం చిన్నారి..

Mar 24 2024 1:35 AM | Updated on Mar 24 2024 8:25 AM

- - Sakshi

లాస్య(ఫైల్‌), పాపను ఆడిస్తున్న కాలనీవాసులు

నిజామాబాద్‌: ఆర్మూర్‌లో పట్టపగలు వివాహిత దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని సంతోష్‌నగర్‌ కాలనీలో శనివారం మధ్యాహ్నం రాసురి లాస్య (22)ను దుండగులు గొంతుకోసి హతమార్చారు. వివరాలిలా ఉన్నాయి. వేల్పూర్‌ మండలం వెంకటాపూర్‌కు చెందిన లాస్యకు రెండేళ్ల క్రితం ఆర్మూరుకు చెందిన రాసూరి రాకేశ్‌తో వివాహమైంది. వీరి కి ఏడు నెలల పాప శ్రీలక్ష్యణ ఉంది. రాకేశ్‌ మూడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు.

లాస్య అత్త చిన్నుబాయితో కలిసి ఉంటోంది. శనివారం ఉదయం చిన్నుబాయి కోరుట్లలో గల తన కూతురు వద్దకు వెళ్లింది. లాస్య మధ్యాహ్నం ఒంటి గంట వరకు తన ఇంటి సమీపంలో ఓ ఇంట్లో బీడీలు చేసి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల సయయంలో పాప ఏడుస్తుండడంతో పక్క ఇంట్లో ఉంటున్న చిట్టి అనే మహిళ వెళ్లి చూడగా లాస్య రక్తపుమడుగులో కనిపించింది. దీంతో ఆమె స్థానికులకు చెప్పడంతో వారు అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్‌హెచ్‌వో రవికుమార్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. లాస్యను హత్య చేసిన వారు ఆమె మెడలోని బంగారు నగలు, చెవి దుద్దులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.

పాపం చిన్నారి..
రక్తం మడుగులో పడి ఉన్న తల్లి వద్ద చిన్నారి ఏడుస్తుండటం కలచి వేసింది. తండ్రి దగ్గర లేకపోవడం తల్లి చనిపోవడంతో ఆ పాప గుక్కపెట్టి ఏడవగా స్థానికులు అక్కున చేర్చుకొని ఓదార్చారు. కాగా తెలిసినవారే లాస్యను హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి చదవండి: ఎలుగుబంటి దాడిలో ఇద్దరు జీడి రైతులు మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement