ప్రేక్షకుల నుంచి చప్పట్లు అందుకోవాలని చేసిన ఓ సాహస విన్యాసం.. ఓ యువ కళాకారుడి జీవితాన్నే ముగించింది. ఆరు రోజుల పాటు తన సైకిల్ స్టంట్లతో జనాలను అలరించిన 27 ఏళ్ల దీపక్.. ఏడో రోజు చేసిన ‘లైవ్ బరియల్’ (సజీవ సమాధి) స్టంట్‌లో మృతి చెందాడు. అయితే కేవలం ఏడు వేల రూపాయల కోసం నిర్వాహకులే అతని ప్రాణాలను బలిగొన్నారనే ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.
హరియాణాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తావుడు ప్రాంతంలోని ఖోరీ కలాన్ గ్రామంలో ఓ ట్రావెలింగ్ సైకిల్ సర్కస్ నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా సాగుతున్న ఈ ప్రదర్శనలో ఫరీదాబాద్ జిల్లా గౌంచి గ్రామానికి చెందిన దీపక్ కీలక పాత్ర పోషించాడు. సైకిల్‌పై ప్రమాదకర విన్యాసాలు చేయడంలో అతడికి మంచి పేరు ఉంది. కళ్లకు గంతలు కట్టుకుని నడపడం, హ్యాండిల్‌పై నిలబడి బ్యాలెన్స్ చేయడం, కదులుతున్న సైకిల్‌పై నిలుచుని ప్రదర్శనలు ఇవ్వడం వంటి స్టంట్లతో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు.
అయితే సర్కస్ చివరి రోజు దీపక్ ఓ ప్రత్యేక విన్యాసం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా అతడిని ఓ సంచిలో ఉంచి, ప్రత్యేకంగా తవ్విన ఓ గోతిలోకి దించారు. 24 గంటల తర్వాత అతడిని సజీవంగా బయటకు తీస్తామని నిర్వాహకులు ప్రేక్షకులకు ప్రకటించారు. అయితే చెప్పిన సమయానికి దీపక్‌ను బయటకు తీయలేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. అతడు దాదాపు 36 గంటల పాటు భూమిలోనే ఉన్నాడు. ఫలితంగా అతని ప్రాణం పోయింది.
రూ.7,100 కోసం ఆలస్యమైందా?
ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి సంచిత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. దీపక్‌ను బయటకు తీయాలంటే రూ.7,100 సేకరించాల్సి ఉందని నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించే ప్రక్రియలోనే ఆలస్యం జరిగిందని భావిస్తున్నారు. చివరకు గోతిని తెరిచి దీపక్‌ను బయటకు తీసిన సమయంలో అతడు మృతిచెంది ఉన్నాడు. ఎక్కువ సమయం భూగర్భంలో ఉండటం వల్ల ఊపిరాడక మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై ఆగ్రహం.. భద్రతపై అనుమానాలు
దీపక్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇలాంటి ప్రమాదకర స్టంట్లను నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసే ఇలాంటి విన్యాసాల్లో కళాకారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీపక్ కుటుంబం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.
పోలీసుల దర్యాప్తు
దీపక్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడిని ఎందుకు సకాలంలో బయటకు తీయలేదు? నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా? స్టంట్ నిర్వహణలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. నూహ్ జిల్లా పోలీసు ప్రతినిధి కృష్ణ కుమార్ ఘటనను ధ్రువీకరించారు. అసహజ మరణం కింద సెక్షన్ 174 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఆరు రోజుల పాటు తన సాహసాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దీపక్.. ఏడో రోజు అదే సాహసం కారణంగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా మారింది. చప్పట్ల కోసం చేసిన విన్యాసం.. చివరకు అతడి జీవితానికి ముగింపు పలికింది.


