కిర్లంపూడి: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని సోమవారం పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వంగవీటి మోహన్‌రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేరుకుని ముద్రగడ పద్మనాభం తనయులు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పెద్ద కుమారుడు ముద్రగడ వీరరాఘవరావును పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు కిర్లంపూడి తరలివచ్చి ముద్రగడ పద్మనాభం సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. దివంగత ముద్రగడతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు. నివాళి అర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట శ్రీరాంజీ, రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు కుంచె రామారావు, జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యుడు వాసిరెడ్డి జమీల్, రాజానగరం, ప్రత్తిపాడు, నరసాపురం నియోజకవర్గాల పరిశీలకులు తోట రామకృష్ణ, ఒమ్మి రఘురాం, ముదునూరి మురళీరాజు తదితరులు ఉన్నారు.


