పొలాల్లో విషం కలుపుతూ.. | - | Sakshi
Sakshi News home page

పొలాల్లో విషం కలుపుతూ..

Jul 22 2026 12:24 AM | Updated on Jul 22 2026 12:24 AM

పిఠాపురం: పొలాల్లో కలుపు నివారణకు రైతులు కలుపు నివారణ మందును పిచికారీ చేస్తుంటారు. దీనివల్ల కలుపు మొక్కలు నాశనవుతాయని వారి ఆలోచన. అయితే పొలాల్లో కలుపు నివారణకు వాడే పారాకాట్‌ అనే మందు ఇప్పుడు మనిషి ప్రాణాలు తీస్తోంది. చాలామంది క్షణికావేశంలో ఈ మందు తాగి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే భూసారానికి, పర్యావరణానికి నష్టం ఏర్పడుతోంది. ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులు సుమారు 2 లక్షల లీటర్ల పేరాకాట్‌ అనే గడ్డిమందును తమ పొలాల్లో వినియోగిస్తున్నట్టు అంచనా.

విషపూరితం

పంటలు వేశాక వాటిలో కలుపు తీయడానికి కూలీలు అవసరమవుతారు. ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువగా ఉండడంతో రైతులు కలుపు నివారణ మందులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పంట వేయక ముందే వీటిని పిచికారీ చేస్తే మంచిదంటూ కొందరు పురుగు మందు దుకాణదారులు చెబుతున్నారు. రైతుల అవగాహనాలేమిని ఆసరాగా తీసుకుని నిషేధిత కలుపు మందులను విక్రయిస్తున్నారు. దీని వల్ల భూములు విషపూరితంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

అవగాహన లేక..

ప్రస్తుతం ఖరీఫ్‌ సాగు ఆలస్యమవ్వడంతో పలు ప్రాంతాల్లోని ఖాళీ భూముల్లో కలుపు నివారణా మందులను విచక్షణా రహితంగా పిచికారీ చేస్తున్నారు. దీంతో గట్లు, చెట్లు, చేమలతో సహా భూములు మాడి మసైపోతున్నాయి. ఈ మందుల వల్ల కలుపు తాత్కాలికంగా మాడి పోతున్నప్పటికీ పంటలు వేశాక మళ్లీ యథాతథంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఏ మందులు వినియోగించాలో కూడా రైతులకు చెప్పే నాథుడు కరువయ్యాడు.

పర్యావరణానికి ముప్పు

కలుపు మందు ఎక్కువగా పిచికారీ చేయడం వల్ల భూసారం తగ్గే అవకాశం ఉంది. పంట దిగుబడులపైనా ప్రభావం చూపడంతో పాటు పంట నాణ్యత దెబ్బతిని, ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కలుపు మందు అవశేషాలు ఉన్న పంటలను ఎగుమతులు చేసే అవకాశం ఉండదు. అమెరికా వంటి అగ్ర దేశాల్లో ఇప్పటికే కలుపు మందులను పూర్తిగా నిషేధించారు. వీటి వల్ల క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇప్పటికే కొన్ని రకాల కలుపు మందులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా అవగాహనా లోపంతో రైతులు వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు.

గడ్డి మందు అమ్మితే కఠిన చర్యలు

గడ్డి మందుగా పిలిచే పేరాకాట్‌ను ఎవరు విక్రయించినా క్రిమిసంహారక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. రైతులు కలుపు మందుతో పని లేకుండా ఇతర మార్గాల ద్వారా కలుపు నివారణకు చర్యలు తీసుకోవడం మంచిది.

– పి.స్వాతి,

వ్యవసాయ శాఖ ఏడీఏ పిఠాపురం

ఫ కలుపు నివారణకు మందుల పిచికారీ

ఫ విచ్చలవిడిగా రైతుల వినియోగం

ఫ భూసారం, పర్యావరణానికి నష్టం

ఫ ఆ మందుతో అనేక అనర్థాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement