అరాచకాలపై మహిళల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

అరాచకాలపై మహిళల కన్నెర్ర

Jul 22 2026 12:24 AM | Updated on Jul 22 2026 12:24 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లైంగిక దాడులు, వేధింపులు, హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఈ భయానక పరిస్థితిపై వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు కన్నెర్ర చేశారు. కాకినాడలోని ఇంద్రపాలెం సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినిడి సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారిపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారిందన్నారు. ఇటీవల గుంటూరు, బద్వేలు వంటి ప్రాంతాల్లో మహిళలపై జరిగిన అవమానవీయ ఘటనలు రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. కొన్ని ఘటనల్లో నిందితులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాజకీయ ఒత్తిడి కారణంగా కేసుల నమోదులో జాప్యం, విచారణలో నిర్లక్ష్యం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతకు తీసుకువచ్చిన దిశ చట్టాన్ని ఈ ప్రభుత్వ నిర్వీర్యం చేసిందన్నారు. మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేందుకే ఈ ప్రభుత్వానికి సమయం సరిపోవడం లేదన్నారు. అనంతరం మహిళలపై దాడులు ఆపాలి, చంద్రబాబు డౌన్‌డౌన్‌, మహిళల కన్నీళ్లకు విలువ లేదా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఆందోళనలో పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, నగర అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ జిల్లా సోషల్‌ మీడియా అధ్యక్షురాలు బీర కృష్ణప్రియ, పార్టీ నాయకులు ఇసుకపట్ల లక్ష్మీకుమారి, మల్లిక, కర్రి అనంత, భవాని, సత్యప్రభ, లలిత, ప్రియ, ధనలక్ష్మి, నాగమణి పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం

సమర్పిస్తున్న మహిళా నాయకులు

కాకినాడలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement