కొనసాగిన దస్తావేజు లేఖర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన దస్తావేజు లేఖర్ల నిరసన

Jul 22 2026 12:24 AM | Updated on Jul 22 2026 12:24 AM

కాకినాడ లీగల్‌: రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396పై దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్‌ రెండో రోజు మంగళవారం కొనసాగింది. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్ల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) సీహెచ్‌ జానకీదేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్‌ అండ్‌ ఆడిట్‌ జిల్లా రిజిస్ట్రార్‌ జేఎస్‌యూ జయలక్ష్మి, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కె.ప్రసాదరావుకు వినతి పత్రాలు అందజేశారు. దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రైవేటీకరించడం వల్ల పారదర్శకత దెబ్బతింటుందని, ప్రజల హక్కులు, ఆస్తుల భద్రతపై అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందన్నారు. జీవో 396ను తక్షణమే ఉపసంహరించుకుని, రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు.

ఉపాధి కోల్పోయే ప్రమాదం

కాకినాడ రూరల్‌: రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను దశల వారీగా ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్‌ ఆందోళనకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థతో ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్న వేల మంది డాక్యుమెంట్‌ రైటర్లు, వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయన్నారు. భూములు, ఆస్తులకు సంబంధించిన అత్యంత కీలకమైన రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ వ్యవస్థనే ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అప్పగించే విధానాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. దస్తావేజు లేఖర్లతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని, రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement