కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లతోపాటు వారి తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన 24 ఏళ్ల యువకుడిపై తక్షణమే కేసు నమోదు చేయాలని కలెక్టర్ హరీంధర ప్రసాద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లా పోలీస్ శాఖకు చేరగా, ఎస్పీ బిందుమాధవ్ నుంచి త్రీ టౌన్‌కు సాయంత్రం అందాయి. కలెక్టర్ ఆదేశాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు, సమీప బంధువు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
రైలు నుంచి
జారిపడి వ్యక్తి మృతి
తుని: మండలంలోని హంసవరం – అన్నవరం మధ్యలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 40 ఏళ్లు) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై వి.సత్తిబాబు మంగళవారం తెలిపారు. అతడి శరీరంపై ఓం, లిజ అనే పచ్చబొట్టు, కుడి చేతిపై బీఆర్‌ఏ పచ్చబొట్టు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతుడి వివరాలు తెలిస్తే తుని జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
6 కిలోల వెండి
వస్తువుల అపహరణ
తాళ్లరేవు: మండల కేంద్రమైన తాళ్లరేవు మార్కెట్ వీధిలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వ్యాపారి అద్దేపల్లి సురేష్ తన కుటుంబ సభ్యులతో కలసి సినిమాకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక వైపు తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. పూజ గదిలోని దేవుడి సామగ్రిని చిందరవందర చేశారు. బెడ్ రూములోని బీరువాను బద్దలుగొట్టి అందులో ఉన్న సుమారు 6 కిలోల వెండి వస్తువులు అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుందని బాధితులు తెలిపారు. సినిమా చూసి ఇంటికి వచ్చిన సురేష్, కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరంగి ఎస్సై సత్యనారాయణ బృందం ఆ ఇంటిని పరిశీలించింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ చోరీతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
మర్యాద పూర్వకంగా..
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఆనందరావును మంగళవారం ఆయన కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. విజయవాడ పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన కాకినాడకు బదిలీపై వచ్చారు. ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన దేవుల నాయక్ తిరుపతి జిల్లాకు బదిలీ అయ్యారు.


