బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రూపొందించనున్న ఓటరు జాబితాను అత్యంత పారదర్శకంగా, దోష రహితంగా సిద్ధం చేసేందుకు సహాయ, సహకారాలను అందించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూరు శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని, 88.05 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలేషన్ చేశారన్నారు. జిల్లాలో కొత్తగా 184 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని, వీటిపై తమ సలహాలు సూచనలు తెలియజేయాలని కోరారు.
పటిష్టంగా చెత్తసేకరణ
ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు సేకరించిన ఘన వ్యర్థాలను ప్రణాళికా ప్రకారం శాసీ్త్రయ పద్ధతుల్లో నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2026పై కాకి నాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన పంచాయతీ అధికారులకు మంగళవారం వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ ఎం.సుధాకరరావు హాజరయ్యారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన కల్పించారు.
కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు
కాకినాడ లీగల్: కాకినాడలో శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టేందుకు నిత్యం డోర్ టు డోర్ చెత్త సేకరణను వంద శాతం అమలు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎంహెచ్‌వో, శానిటేషన్ అధికారులు, వార్డు శానిటేషన్ సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడం, కాలువల్లో చెత్త వేయడం వంటి సమస్యలపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వార్డు శానిటేషన్ సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి వీధి, ప్రతి ఇంటి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని పని చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారికి మొదటి మూడుసార్లు హెచ్చరించాలని, వారిలో మార్పు రాకపోతే నాలుగోసారి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


