ఆరు నెలలుగా ఇంతే..
చెట్టుపై నుంచి పడిపోవడంతో ప్రస్తుతం వీల్‌చైర్‌లో తప్ప నడవడం వీలు కావడం లేదు. దీనివల్ల ప్రైవేటు ఉద్యోగం కాస్తా పోవడంతో ప్రస్తుతం కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. నాకు పింఛన్ ఇప్పించాలని స్థానిక మండల కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాను. పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది.
–పి.శ్రీనివాస్, జి.మేడపాడు,
సామర్లకోట మండలం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పదే పదే తిరుగుతున్నాం.. సమస్యలు పరిష్కరించాలంటూ మొరపెట్టుకుంటున్నాం.. అయినా పరిష్కారం దొరకడం లేదంటూ అర్జీదారులు నిట్టూర్పు వదులుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) తూతూమంత్రంగానే జరుగుతోంది. అనేక మంది అర్జీదారులు వచ్చి తమ వెతలు చెబుతున్నా, పరిష్కారం మాత్రం కానరావడం లేదు. మళ్లీ మళ్లీ వారు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం వల్లే తాము ప్రతి వారం ఇంత దూరం వ్యయ ప్రయాసలు కోర్చి రావాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్జీదారుల నుంచి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అర్జీలు స్వీకరించారు. అయితే కార్యాలయాల చుట్టూ తిరగడం మినహా తమకు సరైన పరి ష్కారం దొరకడం లేదని పలువురు వాపోయారు.
నా కాలిని కోల్పోయినా..
రెండేళ్ల కిందట నా కాలిని కోల్పోయాను. ఎవరో ఒకరి సాయం లేనిదే బయటకు రాలేను. వికలాంగ పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి సారీ ఏదొక షాకు చెబుతున్నారు. ఒకరి సహాయం తీసుకుని కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ అందించాను. వచ్చినప్పుడల్లా ఆటో ఖర్చులు కూడా ఎక్కువగా అవుతున్నాయి. అధికారులు ఆదుకోవాలి.
– సిద్ధాం రామారావు, జగన్నాథపురం, కాకినాడ
పనికావడం లేదు
మా నాన్న ద్వారా సంక్రమించిన వ్యవసాయ భూమి నా పేరున పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అధికారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మండల కార్యాలయంలో పనికావడం లేదని జిల్లా కేంద్రానికి వస్తున్నా. ఏడాదిన్నర నుంచి తిరుగున్నా, ఇక్కడా సరైన పరిష్కారం దొరకడం లేదు. వచ్చిన ప్రతి సారీ దారి ఖర్చులు తప్పడం లేదు.
–బి.వీరేంద్రకుమార్,
ఎస్.అన్నవరం, తుని మండలం
ఫ పీజీఆర్‌ఎస్ అర్జీలకు
కానరాని పరిష్కారం
ఫ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
తిరగని కార్యాలయం లేదు
రెండేళ్లుగా తిరగని కార్యాలయం లేదు. దరఖాస్తు ఇవ్వని అధికారి లేరు. నా వ్యయసాయ భూమిని ఆన్‌లైన్ చేయడం లేదు. ప్రతి సారీ ఆటోలో కలెక్టరేట్‌కు వచ్చి దరఖాస్తు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రెండేళ్లుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నా పేరున ఉన్న భూమి ఆన్‌లైన్ చేసేందుకు ఎందుకు ఇబ్బందో అధికారులు చెప్పడం లేదు.
– పుణ్యమంతుల సీతాదేవి, ధర్మవరం, ప్రత్తిపాడు మండలం


