అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అన్నదాన భవనం, భక్తుల క్యూ కాంప్లెక్స్, సీతారామ సత్రం పనులను గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశించారు. అన్నవరం దేవస్థానంలో కమిషనర్ పర్యటన రెండో రోజు సోమవారం కూడా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ స్కీమ్ నిధులు రూ.18 కోట్లతో నిర్మిస్తున్న అన్నదాన భవనం, భక్తుల క్యూ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు. క్యూ కాంపెక్స్‌లో భక్తులకు గాలి బాగా వచ్చేలా అన్ని వైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్నదానం భవన నిర్మాణంలో గత పర్యటనలో చేసిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారా అని కమిషనర్ ప్రశ్నించారు. రూ.15 కోట్లతో శ్రీసీతారామ సత్రం పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం సత్యగిరిపై హరిహరసదన్ సత్రం వద్ద పెళ్లి కోసం వేసిన షామియానాలు అలాగే ఉంచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించి, కాంట్రాక్టర్‌కు అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. కొండ దిగువన దేవస్థానం గోశాల వద్ద ముందు ఉన్న స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పక్కా నిర్మిస్తున్న విషయం కమిషనర్ దృష్టికి తీసుకురాగా, దీనిని తొలగించేలా కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఈఓ నల్లం సూర్యచక్రధర్‌రావుకు తెలిపారు.


