మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావులకు నివాళులర్పిస్తున్న నాయకులు, అభిమానులు
సభలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పక్కన మాజీ మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన, మాజీ ఎంపీ భరత్‌రామ్ తదితరులు
సాక్షి, రాజమహేంద్రవరం/ సీటీఆర్‌ఐ: కాపు జాతి కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతులు ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు అని వక్తలు కొనియాడారు. ఇటీవల కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు మృతి చెందడంతో వారికి సంస్మరణ సభను రాజమహేంద్రవరంలో నగర కాపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేశారు. వేలాది మంది ముద్రగడ, జీఎస్ రావు అభిమానులు తరలివచ్చారు. జై ముద్రగడ, జై వంగవీటి, జై జీఎస్‌ఆర్, జై జక్కంపూడి రామ్మోహన్‌రావు అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీలకు అతీతంగా ముద్రగడ, జీఎస్ రావు చిత్రపటాలకు నివాళుల ర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రాజకీయ మహోన్నతుడని కీర్తించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావులు సజీవంగా లేకపోయినా, వారి సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎంతో కోల్పోయినా కాపుల అభ్యున్నతి కోసం ముద్రగడ పద్మనాభం పరితపించారని కొనియాడారు. జీఎస్ రావు నీతి, నిబద్ధత కలిగిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. విజయవాడలో ముద్రగడ సంస్మరణ సభ నిర్వహించాలని కోరారు. రిజర్వేషన్ ఫలాలు కాపులకు అందిన రోజునే ముద్రగడ ఆత్మ శాంతిస్తుందన్నారు. వంగవీటి మోహనరంగా బతికి ఉంటే ముఖ్యమంత్రి అయ్యుండేవారన్నారు. కాపుల రిజర్వేషన్ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం అని అన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తోట రామకృష్ణ, గిరజాల బాబు మాట్లాడారు.
కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి
మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ నమ్మిన లక్ష్యం కోసం ముందుకు సాగిన గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం అని అన్నారు. గోదావరి జిల్లాల్లో పద్మనాభం కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభంజనంలోనూ జీఎస్ రావు గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు ధ్రువతారలని కొనియాడారు. ప్రజల కోసం ఆలోచించే నాయకుడిని కోల్పోయామన్నారు. సత్యం కోసం హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పడినట్టు.. ఇచ్చిన మాట కోసం తీసుకున్న నిర్ణయాలకు ముద్రగడ కట్టుబడి ఉన్నారన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ముద్రగడ చూపిన బాటలో ముందుకు సాగుతామన్నారు. కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు పోరాడతామన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కులం కోసం అహర్నిశలు ముద్రగడ శ్రమించారన్నారు. ముద్రగడ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.
కాపు కార్పొరేషన్‌కు నిధులివ్వడం లేదు
కాపు జేఏసీ నాయకుడు దాసరి రాము మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేసినా అవినీతి మచ్చ లేకుండా ఉండటం సామాన్య విషయం కాదన్నారు. కాపు జాతికి ఆయన చేసిన సేవలను మరిచిపోకూడదన్నారు. జీఎస్ రావు కాపు జాతికి అనేక సేవలు అందించారన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీలకు అతీతంగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.మూడు వేల కోట్లు ఇస్తామని చెప్పినా, రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. అడ్వకేట్ కన్నా రజిని మాట్లాడుతూ మన జాతిలోనే మనల్ని అణగదొక్కే శక్తులున్నాయన్నారు. జీవితాంతం కాపుల కోసం పరితపించిన ముద్రగడని పొగడకపోయినా పర్వాలేదు కానీ కులద్రోహిగా చిత్రీకరించొద్దన్నారు.
ఆఖరి కోరిక తీర్చేందుకే అడ్డుకున్నాం
ముద్రగడ పద్మనాభం చివరి రోజుల్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం మాజీ రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ అన్నారు. నేటి నుంచి తాను వ్యక్తిగతంగా ముద్రగడ కాపు అని చెప్పుకొంటానన్నారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నా.. ముద్రగడ ఆఖరి కోరిక తీర్చేందుకే తాను, మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్నామన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పుట్టిన ప్రతి ఒక్కరూ మరణిస్తారని, కానీ కొంత మంది మాత్రమే మంచి కార్యక్రమాలు చేసి చిరంజీవులుగా మిగిలిపోతారన్నారు. అటువంటి వారిలో ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు ఉన్నారన్నారు. జాతి, కుల, మతాలకు అతీతంగా తరలివచ్చిన ఇంత మంది మనసులో వారు సజీవంగా ఉంటారన్నారు.
రిజర్వేషన్ కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం
అనంతరం పలువురు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ ముద్రగడ, జీఎస్ రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి బాటలోనే ముందుకు సాగుతామన్నారు. పార్టీలకు అతీతంగా రిజర్వేషన్ సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాజమహేంద్రవరం కాపు సంఘం అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు, భీమవరం ఇన్‌చార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు, తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి వడ్డి రఘురామ్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం, రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ పరిశీలకులు తోట రామకృష్ణ, గిరజాల బాబు, నాయకులు జెట్టి గురునాథం, యాళ్ల సురేష్, కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, ఆరేటి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కాపుల అభ్యున్నతికి
ముద్రగడ ఎనలేని కృషి
ఫ నీతి, నిబద్ధతకు నిదర్శనం జీఎస్ రావు
ఫ నగర కాపు సంఘం
ఆధ్వర్యంలో సంస్మరణ సభ
ఫ నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీల నాయకులు


