ఆరుతడి పంటలు సాగుచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగుచేయాలి

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

కొడకండ్ల: ప్రస్తుత సీజన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల సాగు విధానాలను మార్చుకొని, ఆరుతడి పంటల సాగును చేయాలని, ఈమేరకు గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా దిశానిర్దేశం చేశారు. సోమవారం మొండ్రాయి గ్రామంలో కొమ్ము మహేందర్‌ కూరగాయల సాగు క్షేత్రాన్ని కలెక్టర్‌ సందర్శించి సాగుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేయడం వల్ల తక్కువ నీళ్లతో దిగుబడి వచ్చి ఆదాయం సమకూరే అవకాశం ఉందని సూచించారు. గిర్నితండాలోని జ్యోతిబాఫూలే గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం, పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించారు. అలాగే గ్రామంలోని అభయ్‌ పర్టిలైజర్‌ షాపును కలెక్టర్‌ తనీఖీ చేసి లైసెన్స్‌, కొనుగోలు రిజిష్టర్‌లను పరిశీలించి స్టాక్‌ నిల్వలను పరిశీలించారు. ఈపాస్‌ యంత్రంలో నమోదైన కొనుగోలు వివరాలు, నిల్వ ఉన్న యూరియా బస్తాల స్టాక్‌లో తేడా రావడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి రవికాంత్‌, సర్పంచ్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

నెలవారీ పరిశుభ్రత మూల్యాంకనం

జనగామ రూరల్‌: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నివారణ, ఓడీఎఫ్‌ స్థిరత్వం, ప్రజా ఆరోగ్య ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ‘ఎస్‌జే–స్కోర్‌ (స్వచ్ఛ జనగామ పారిశుద్ధ్యం టాస్క్‌ఫోర్స్‌) పేరిట నెలవారీ సమగ్ర మూల్యాంకన విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి పారిశుద్ధ్య నిర్వహణపై మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ..ప్రతీ గ్రామ పంచాయతీలో ప్రతీ నెల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆధారాలతో కూడిన 100 మార్కుల విధానంలో మూల్యాంకనం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రేడ్‌–ఏ సాధించిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రశంసపత్రాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీ పురస్కారాలు అందజేస్తామని, వరుసగా తక్కువ గ్రేడ్‌లు పొందిన గ్రామ పంచాయతీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమీక్షలో ఆర్డీఓలు గోపీరామ్‌, కిరణ్‌ ప్రకాష్‌, డీఆర్డీఓ భాస్కర్‌, పీడీ ఈజీఎస్‌ సూరి, డీపీఓ వెంకట్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement