హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఆరవ రోజు అమ్మవారిని విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు అధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విప్రచిత్తా క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని మహావజ్రేశ్వరీ క్రమంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత మాట్లాడుతూ భక్తులు సంప్రదాయమైన దుస్తులు ధరించి రావాలని, దేవాలయం, ప్రాంగణంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు తీయడం, రీల్స్ చేయడం నిషేధమని పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు.


