మరోవైపు ఎరువుభారం!
జనగామ రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభమై యాభై రోజులు దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈనేపథ్యంలో కనీసం తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుందామంటే ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా మినహా మిగతా ఎరువులకు కేంద్రం ఇచ్చే రాయితీ స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి, ఖర్చుల ఆధారంగా ఆయా కంపెనీలు రైతులకు విక్రయించే ఎరువుల ధరలను పెంచుకునేలా కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ముడిసరకులు, దిగుమతి ఖర్చుల పేరిట కంపెనీలు పదేపదే ఎరువుల ధరలు పెంచుతున్నాయి. ప్రభుత్వం రాయితీతో అందజేసే డీఏపీ రూ.1,350, యూరియా రూ.266 ధరలు మినహా మిగతా ఎరువుల ధరలు అన్నింటినీ పెంచారు.
ఆర్థిక భారం
జిల్లాకు 70,900 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. వీటిలో ప్రతీ ఎరువు 50 కిలోల సంచికి రూ.300–400లకు పైగా ధరలు పెరిగాయి. దీంతో పెట్టుబడిలో ఒక్కో రైతు రూ.4వేల వరకు అదనంగా భారం మోయాల్సిన పరిిస్థితి నెలకొంది. డీఏపీ వాడకాన్ని తగ్గించేందుకు రెండు, మూడు డీఏపీ సంచులు తీసుకునే రైతులకు నానో డీఏపీ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే రైతులు నానో డీఏపీ తీసుకోవడానికి మొగ్గు చూపడం లేదు. డీఏపీ బస్తా ధర రూ.1,350లు కాగా.. నానో డీఏపీ బాటిల్ ధర రూ.560లు ఉంది. అయినా కూడా పంట దిగుబడి సరిగ్గా వస్తుందో లేదోనని రైతులు భయపడి నానో డీఏపీ వాడడానికి వెనకంజ వేస్తున్నారు.
ధరలు తగ్గించాలి
ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌నిలో ప్రభావంతో పంట సాగు అంతంత మాత్రమే ఉండగా ప్రత్యామ్నాయ పంట లపై అవగాహన కల్పించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఎరువు భారం తగ్గించాలి.
– చందూ నాయక్,
జిల్లా కార్యదర్శి, రైతు సంఘం
సాగు అంతంత మాత్రమే..
ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది. మద్దతు ధర నామమాత్రంగా పెంచి ఎరువుల ధరలు మాత్రం భారీగా పెంచారు. ఆరుతడి పంటలను సాగుచేయాలని చెబుతున్నా ప్రభుత్వం విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. – ఎడ్ల శ్రీనివాస్, మరిగడి
యూరియా డీఏపీ
ఎన్‌పీకే ఎంఓిపీ
ఎస్‌ఎస్‌పీ
దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
సాగు చేద్దామంటే వానలు లేవు..
వేసిన పంటను దక్కించుకుందామంటే కొండెక్కిన ఎరువులు
నానో డీఏపీ తీసుకోవాలంటున్న అధికారులు
దిగుబడిపై అనుమానంతో మొగ్గుచూపని రైతులు
జిల్లాకు అవసరమయ్యే
కాంప్లెక్స్ ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో)


