హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్‌నినోతో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, రైతుల ప్రయోజనాలు, సాగు, తాగునీటి లభ్యత, పశుసంపద రక్షణ తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెకర్లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ప్రస్తుత పంటల పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఎమ్మెల్యేలు స్థానిక పరిస్థితులను వివరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి శ్రీదేవసేనను నియమించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,
పొన్నం ప్రభాకర్
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం,
వివిధ శాఖల సంసిద్ధతపై సుదీర్ఘ సమీక్ష
హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా
ప్రజాప్రతినిధులు, అధికారులు
దేవాదుల పూర్తికి ప్రభుత్వం చర్యలు :
మంత్రి పొంగులేటి
వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటికి ప్రధాన ఆధారమైన దేవాదుల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. తాగు, సాగునీరు, పశువులకు మేత, ఉపాధి హామీ పనులు, రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. లెమన్ గ్రాస్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై వచ్చిన సూచనలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలిస్తే ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైతే దేవాదులపై ప్రత్యేకంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రైతులకు శాసీ్త్రయ అవగాహన కల్పించాలి:
మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులపై శాస్త్రవేత్తల అంచనాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి రైతులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఈ సీజన్‌లో తీసుకునే నిర్ణయాలు వచ్చే ఏడాది జూన్ వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టర్ల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ ఆధారాలతో అవగాహన కల్పించాలని, కరపత్రాలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.


