ప్రకృతి ఒడిలో జీవన పాఠాలు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో జీవన పాఠాలు

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

జనగామ: పుస్తకాల భారానికి నెలలో ఒకరోజు విరామమిస్తూ, ప్రకృతి, పొలం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలనే తరగతి నుంచి బయటకు తీసుకెళ్లి విద్యార్థులకు అనుభవాత్మక విద్యను అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రతీ నెల మూడో శనివారం నిర్వహిస్తున్న ‘నో బ్యాగ్‌ డే’ కార్యక్రమం ద్వారా ఆటలు, పా టలు, ప్రత్యక్ష పరిశీలనతో నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, క్రమశిక్షణ, సామాజిక అవగాహన పెంపొందిస్తున్నాయి.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత నైపుణ్యాలు, ప్రకృతి పరిజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నో బ్యాగ్‌ డే’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని 341 ప్రాథమిక, 64 ఉన్నత ప్రాథమిక, 103 ఉన్నత పాఠశాలలు కలిపి 508 ప్రభుత్వ పాఠశాలల ఉండగా, చాలా పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థులను పొలంబడి, ప్రకృతి వనాలు, చారిత్రక ప్రదేశాలు, శిలాశాసనాలు, దేవాలయాలు, స్థానిక వారసత్వ కట్టడాల వద్దకు తీసుకెళ్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వరి నాట్లు వేయించడం, పంటల సాగు విధానాలను ప్రత్యక్షంగా చూపించడం ద్వారా వ్యవసాయంపై అవగాహన కల్పిస్తుండగా, మరికొన్ని చోట్ల మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు.

ఆటలు, పాటలు, నాయకత్వ లక్షణాలు

ఆటలు, పాటలు, జానపద కళలు, కథల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. పాఠ్యాంశాలతో పాటు స్థానిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగా హన పెరగడంతో విద్యార్థుల్లో పరిశీలనా దృష్టి, సామాజిక బాధ్యతా భావం కూడా పెరుగుతోంది. జిల్లాలోని వందలాది ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఈ కార్యక్రమం విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వంతో తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తోందని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల అభ్యాసాన్ని ఆనందదాయకంగా మార్చడంతో పాటు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించే సామర్థ్యాన్ని పెంపొందించే వినూత్న విద్యా విధానంగా నో బ్యాగ్‌ డే కార్యక్రమం నిలుస్తోంది.

పొలం పాఠాలు గుర్తుండిపోతాయి

పొలంబడి కార్యక్రమంలో పాల్గొని వరి నాట్లు ఎలా వేస్తారో ప్రత్యక్షంగా చూశాం. రైతులు పడే కష్టాన్ని అర్థం చేసుకున్నాం. పుస్తకాల్లో చదివిన దానికంటే ప్రత్యక్షంగా నేర్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది.

–ఎం.వర్షిత, 6వ తరగతి,

ప్రభుత్వ పాఠశాల, కొడవటూరు

సులభంగా నేర్చుకుంటున్నాం..

ప్రకృతి ఒడిలో చెట్ల ప్రాముఖ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి ఉపాధ్యాయులు వివరించారు. మొక్కలను కాపాడాలనే బాధ్యత పెరిగింది. ఇలాంటి కార్యక్రమాలతో కొత్త విషయాలు సులభంగా నేర్చుకుంటున్నాం.

–నీలా దినేష్‌, 6వ తరగతి,

ప్రభుత్వ పాఠశాల, కొడవటూరు, బచ్చన్నపేట

‘నో బ్యాగ్‌ డే’తో విద్యార్థులకు

అనుభవాత్మక విద్య

వ్యవసాయం నుంచి చరిత్ర వరకు

నేర్చుకునే అవకాశం

ప్రతీ మూడో శనివారం ప్రభుత్వ

పాఠశాలల్లో వినూత్న కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement