న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026
అత్యుత్తమం..
వ్యవసాయ పనితీరులో రాష్ట్రంలో జిల్లాకు రెండో స్థానం
జనగామ: రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన జూన్–2026 పారామీటర్ వైజ్ డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్‌లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది. గతంలో 25వ స్థానంలో ఉన్న జిల్లా.. ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం మూడున్నర నెలల్లోనే విశేష పురోగతి సాధించి రాష్ట్రంలో అగ్రశ్రేణి జిల్లాల్లో ఒకటిగా నిలవడం గమనార్హం. రాష్ట్రం రూపొందించిన ఏడు కీలక పనితీరు సూచికల్లో 70 మార్కులకు గాను 49.73 పాయింట్లు సాధించిన జిల్లా, పెద్ద జిల్లాలను మాత్రమే కాకుండా వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న అనేక జిల్లాలను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది.
పెండింగ్ కేసుల పరిష్కారం..
రైతుబీమా, రైతు భరోసా వంటి పథకాల అమలులో అధికారులు దృష్టి సారించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా నిరంతర సమీక్షలు నిర్వహించారు. రైతుబీమాకు సంబంధించిన మొత్తం 552 కేసులు ఉండగా ప్రస్తుతం 21కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు వివాదాలు తదితర కారణాలతో నిలిచిపోయిన కేసులతో పాటు ఇటీవల నమోదైన మరో 9 కేసులను కూడా పరిష్కరించి 100 శాతం క్లెయిమ్ క్లియరెన్స్ సాధించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీలో వేగం..
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలో జిల్లా ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి చేసింది. రైతుల భూములు, పంటలు, ఆధార్, బ్యాంకు వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలుకు పటిష్టమైన డేటాబేస్ సిద్ధమవుతోంది.
ఫర్టిలైజర్స్ విక్రయాలపై పర్యవేక్షణ
ఎరువులు, పురుగు మందుల విక్రయాలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో పర్యవేక్షించడం, ఫర్టిలైజర్ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, స్టాక్‌లను పరిశీలించడం, బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం, ప్రతీ విక్రయాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయించడం వంటి చర్యలతో జిల్లా మంచి మార్కులు సాధించింది.
ఆరుతడి పంటలకు ప్రోత్సాహంలో..
ప్రస్తుత వానాకాలంలో వరిసాగు తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించ డంపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వరి, పత్తి సాగు అంచనాతో పోలిస్తే సుమారు 52 వేల ఎకరాలు తక్కువ నమోదవడంతో రైతులకు కందులు, పెసర్లు, ఇతర పప్పుధాన్యాల సాగుపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో కందుల సాగు లక్ష్యం 3,350 ఎకరాలు కాగా ఇప్పటికే 5,613 ఎకరాలకు పైగా, పెసర సాగు లక్ష్యం 657 ఎకరాలు కాగా 562 ఎకరాల్లో సాగు పూర్తయింది. ఇంకా ఈ నెల చివరి వరకు, వచ్చే నెల తొలి వారంలో 18వేల ఎకరాల్లో కందులు సాగు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతిరోజూ సమీక్షలు..
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవసాయ శాఖ పనితీరుపై నిరంతర సమీక్షలు, మండలాల వారీగా పురోగతిని పరిశీలించడం, వెనకబడిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతర పర్యటనలు చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏఈఓలు, ఏఓలు, జిల్లా స్థాయి సిబ్బంది సమష్టి కృషితో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుని ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు.
వివిధ విభాగాల్లో
జిల్లా సాధించిన మార్కులు
రైతుల నమోదు
రైతుబీమా
మరణాల నమోదు
రైతుబీమా పరిహార
దరఖాస్తుల పరిష్కారం
యూరియా వినియోగ
ధ్రువీకరణ నివేదిక
క్షేత్రస్థాయి సేవల
మొబైల్ వినియోగం
ఆన్‌లైన్ భూసంబంధ
సేవల నిర్వహణ
వ్యవసాయ విస్తరణ
అధికారుల హాజరు
గతంలో 25వ స్థానం..
మూడున్నర నెలల్లోనే అద్భుత ప్రగతి
70 మార్కులకు గాను 49.73 పాయింట్లు
కలెక్టర్ పర్యవేక్షణలో అధికారుల సమష్టి కృషి


