హమ్మయ్యా.. ఎట్టకేలకు ముగిసిన హంటా వైరస్ టెన్షన్ | WHO Declares End Of Rare Cruise Ship Hantavirus Outbreak After Global Monitoring, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా.. ఎట్టకేలకు ముగిసిన హంటా వైరస్ టెన్షన్

Jul 3 2026 2:38 PM | Updated on Jul 3 2026 3:39 PM

Who Declares Hantavirus Outbreak Linked To Cruise Ship Over

ప్రపంచాన్ని కొద్ది రోజులుగా ఆందోళనకు గురి చేసిన క్రూయిజ్ నౌక హంటావైరస్ వ్యాప్తి ఎట్టకేలకు ముగిసింది. చివరిగా వైరస్ బారినపడిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా 42 రోజుల పర్యవేక్షణను పూర్తి చేసి, పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో ఈ వ్యాధి వ్యాప్తి అధికారికంగా ముగిసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. దీంతో రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.

ఈ ఘటన ఎంవీ హోండియస్ క్రూయిజ్ నౌకలో జరిగింది. ఈ నౌక ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి అంటార్కిటికా పర్యటనకు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో కొందరు ప్రయాణికులు తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు చేయగా, వారికి ఆండీస్ హంటా వైరస్ అనే అరుదైన వైరస్ సోకినట్లు తేలింది. ఈ వైరస్ సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఈ రకమైన వైరస్ అరుదుగా ఒక మనిషి నుంచి మరో మనిషికి కూడా సోకే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత పెరిగింది.

ఈ వ్యాప్తిలో మొత్తం 13 మంది వైరస్ బారిన పడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. అలాగే భారత్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఈ నౌకలో పనిచేశారు. అయితే వారికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, ముందుజాగ్రత్తగా పర్యవేక్షణలో ఉంచినట్లు భారత ఆరోగ్య అధికారులు అప్పట్లో వెల్లడించారు. దేశానికి ఎలాంటి తక్షణ ముప్పు లేదని కూడా స్పష్టం చేశారు.

వైరస్‌ వ్యాప్తి గుర్తించిన వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ, పలు దేశాల ప్రభుత్వాలు కలిసి చర్యలు చేపట్టాయి. నౌకలో ఉన్న ప్రయాణికులను వారి వారి దేశాలకు ప్రత్యేక ఏర్పాట్లతో పంపించి, 42 రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 33 దేశాల్లో వందలాది మంది కాంటాక్టులను గుర్తించి పర్యవేక్షించారు. చివరకు చివరి వ్యక్తి కూడా ఆరోగ్యంగా బయటపడటంతో వైరస్ వ్యాప్తి గొలుసు పూర్తిగా తెగిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

నిపుణుల ప్రకారం, హాంటావైరస్ సాధారణంగా మనుషుల మధ్య సులభంగా వ్యాపించదు. ఎక్కువగా ఎలుకల మూత్రం, విసర్జన, వాటి ద్వారా కలుషితమైన ప్రదేశాల వల్ల సోకుతుంది. అయితే ఈ ఘటనకు కారణమైన ఆండీస్ హాంటావైరస్ మాత్రం అరుదుగా మనిషి నుంచి మనిషికి వ్యాపించే లక్షణం కలిగి ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించింది. ఈ ఘటన ముగియడం ప్రపంచానికి ఊరటనిచ్చినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు వ్యాపించినప్పుడు దేశాల మధ్య వేగవంతమైన సమాచారం, తక్షణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ వంటి చర్యలు ఎంత ముఖ్యమో మరోసారి ఈ సంఘటన గుర్తు చేసిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement