లక్ష డాలర్ల బాంబు | US President Donald Trump sensational decision on H-1B visa | Sakshi
Sakshi News home page

లక్ష డాలర్ల బాంబు.. నేటి నుంచే అమల్లోకి..

Sep 21 2025 5:48 AM | Updated on Sep 21 2025 5:49 AM

US President Donald Trump sensational decision on H-1B visa

హెచ్‌–1బీ వీసా వార్షిక రుసుము రూ. 88 లక్షల పైమాటే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం 

ఉత్తర్వుపై సంతకం.. నేటి నుంచే అమల్లోకి.. 

విదేశాల్లో ఉన్న వీసాదారులు అమెరికాకు చేరుకోవాలని కంపెనీల ఆదేశం 

ఉద్యోగుల పరుగులతో రద్దీగా ఎయిర్‌పోర్టులు.. భారీగా పెరిగిన విమాన చార్జీలు 

హెచ్‌–1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని ట్రంప్‌ ఆగ్రహం 

అమెరికా పౌరులకు అన్యాయం జరుగుతున్నట్లు ఆక్షేపణ 

ప్రతిభావంతులైన నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవచ్చని సూచన  

తమ నిర్ణయం పట్ల టెక్‌ కంపెనీల సీఈఓలు కచ్చితంగా సంతోషిస్తారని వెల్లడి 

ప్రస్తుతం రూ.4.40 లక్షల దాకా ఉన్న హెచ్‌–1బీ వీసా రుసుము 

ఇకపై విదేశీ ఉద్యోగిని నియమించుకోవాలంటే ఏటా రూ.88 లక్షలు చెల్లించాలి

అమెరికా కంపెనీలపై పెనుభారం.. స్థానికులకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం 

భారతీయ టెక్నాలజీ నిపుణులకు నష్టమేనంటున్న నిపుణులు

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: అమెరికా నుంచి వలస దారులను బయటకు పంపించి, అమెరికన్ల మనసులు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో పెద్ద బాంబు పేల్చారు. విదేశీ వృత్తి నిపుణులు అమెరికా గడ్డపై ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న హెచ్‌–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకుపైగా) పెంచేశారు. ఈ మేరకు ‘నాన్‌–ఇమిగ్రెంట్‌ ఉద్యోగుల ప్రవేశంపై ఆంక్షలు’ పేరిట సంబంధిత ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. 

అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 21వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు. ప్రతిఏటా హెచ్‌–1బీ వీసాలు పొందుతున్నవారిలో 70% మంది భారతీయులే కావడంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్‌ డ్రీమ్స్‌ వదులుకోవాల్సి రావొచ్చని అంటున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తూ విదేశీయులను నియమించుకొనే కంపెనీలు వారికి హెచ్‌–1బీ వీసాలు జారీ చేయడానికి ప్రతి సంవత్సరం రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ భారాన్ని మోయలేని కంపెనీలు విదేశీ ఉద్యోగులను పక్కనపెట్టి, స్థానిక అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. సరిగ్గా ట్రంప్‌ ఆశిస్తున్నది కూడా ఇదే. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయం వెంటనే ప్రభావం చూపింది. గడువు దాటితే రూ.88 లక్షలు చెల్లించక తప్పని పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న హెచ్‌–1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులు తక్షణమే అమెరికాకు చేరుకోవాలని కంపెనీలు ఆదేశించాయి. దాంతో విమానాశ్రయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఉత్తర్వు అమల్లోకి వచ్చే నిర్దేశిత గడువులోగా అమెరికాలో అడుగుపెట్టడానికి హెచ్‌–1బీ వీసాలు కలిగిన విదేశీ ఉద్యోగులు పరుగులు తీశారు.  

అమెరికా జాతీయ భద్రతకు ముప్పు: ట్రంప్‌ 
అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే అమెరికాలోకి అనుమతించాలన్నదే తమ విధానమని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టంచేశారు. హెచ్‌–1బీ వీసా కార్యక్రమం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆయన ఆక్షేపించారు. నైపుణ్యంతో కూడిన పనులు చేయడానికి విదేశాల నుంచి తాత్కాలిక ఉద్యోగులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ వీసా దుర్వినియోగం అవుతోందని అన్నారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనం, తక్కువ నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి హెచ్‌–1బీని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. 

అంతేకాకుండా ఈ వీసాలపై ఆధారపడిన ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలు వీసా మోసాలు, మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. విదేశీయులను అడ్డదారుల్లో అమెరికాకు చేరవేస్తున్నట్లు కనిపెట్టాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలను అరికట్టడానికి కంపెనీలపై వీసా దరఖాస్తు ఫీజులు పెంచక తప్పడం లేదని వివరించారు. విదేశీ నిపుణుల్లో అత్యంత ప్రతిభావంతమైన నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి కంపెనీలకు అనుమతి ఇస్తున్నామని, అందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించారు. 

తమ నిర్ణయం పట్ల టెక్‌ కంపెనీల సీఈఓలు కచ్చితంగా సంతోషిస్తారని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వీసాల ముసుగులో కొనసాగుతున్న విచ్చలవిడి వలసలకు కళ్లెం వేయక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు.  కంప్యూటర్‌ సంబంధిత రంగాల్లో కంపెనీలు హెచ్‌–1బీ వీసాలతో విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తూ అమెరికన్లకు అన్యాయం చేస్తున్నాయని తప్పుపట్టారు. 2003లో హెచ్‌–1బీలు పొందిన విదేశీయుల్లో ఐటీ ఉద్యోగులు 32 శాతం మంది ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 65 శాతానికి చేరడం గమనార్హం. ట్రంప్‌ తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నిపుణులైన విదేశీ మానవ వనరులను అమెరికాకు దూరంచేసే ప్రయత్నం మానుకోవాలని ట్రంప్‌ ప్రత్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.  

ప్రతిభలేనివారు మనకెందుకు?: హోవార్డ్‌ లుట్నిక్‌ 
అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలో హెచ్‌–1బీ నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసా కార్యక్రమం అత్యధికంగా ఉల్లంఘనకు గురవుతోందని వైట్‌హౌస్‌ స్టాఫ్‌ సెక్రెటరీ విల్‌ స్కార్ఫ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వీసా అసలు ఉద్దేశం నెరవేరడం లేదన్నారు. అమెరికా కామర్స్‌ సెక్రెటరీ హోవార్డ్‌ లుట్నిక్‌ మాట్లాడుతూ.. అమెరికన్ల అవకాశాలు దోచుకొనేవారు తమకు అవసరం లేదన్నారు. అత్యధిక నైపుణ్యాలు కలిగినవారికే అమెరికాలో ఉద్యోగాలు దక్కాలని చెప్పారు. అలాంటి నిపుణులు అమెరికాలో వ్యాపారాలు చేసి, ప్రతిభతో అమెరికన్ల కోసం కొత్త ఉద్యోగాలు సృష్టించగలరని తెలిపారు. దీనివల్ల అమెరికా ఖజానాకు 100 బిలియన్‌ డాలర్ల మేర లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 

ఒక విదేశీ ఉద్యోగి కచ్చితంగా అవసరమని భావిస్తే అతడి కోసం ఏటా లక్ష డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాలని, లేకపోతే అమెరికా పౌరుడినే నియమించుకోవాలని కంపెనీలకు సూచించారు. ప్రతిభ లేని విదేశీయులు మనకెందుని ప్రశ్నించారు. స్థానికులకే శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కంపెనీలకు స్పష్టంచేశారు. హెచ్‌–1బీ వీసాల రెన్యూవల్స్‌తోపాటు కొత్త దరఖాస్తులకు కూడా లక్షల డాలర్ల రుసుము వర్తిస్తుందని హోవార్డ్‌ లుట్నిక్‌ వెల్లడించారు. మరోవైపు ఒక విదేశీ ఉద్యోగి గ్రీన్‌కార్డు పొందడం కోసం కంపెనీ ఇప్పటికే స్పాన్సర్‌ చేస్తే అతడి వీసాను రెన్యూవల్‌ చేయడానికి ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అది భారంగా భావిస్తే రెన్యూవల్‌ చేయడం ఆపేయొచ్చు. ఫలితంగా గ్రీన్‌కార్డు ఆశలు సైతం వదులుకోవాల్సిందే. గ్రీన్‌కార్డుల కోసం ఇప్పటికే వేలాది మంది విదేశీయులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు.

ఏమిటీ హెచ్‌–1బీ వీసా? 
విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్‌ చట్టం ద్వారా హెచ్‌–1బీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. హెచ్‌–1బీ వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల (రూ.1.76 లక్షలు– రూ.4.40 లక్షలు) దాకా ఉంది. తొలుత మూడేళ్ల కాలానికి హెచ్‌–1బీ వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో మూడేళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే. 

ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్‌లో ఇంజనీరింగ్‌ విద్య అభ్యసించిన విద్యార్థుల కల హెచ్‌–1బీ వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియనివాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా హెచ్‌–1బీ వీసా దరఖాస్తు ఫీజుతోపాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప హెచ్‌–1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement