అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అన్నందుకు ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్-కమ్-యూట్యూబర్‌ను చైనాలో 15 గంటల పాటు నిర్బంధించిన వైనం మరోసారి ఆందోళన రేపింది. నవంబర్ 16న జరిగిన సంఘటనను వివరిస్తూ డిసెంబర్ 23న ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ యూట్యూబ్‌లో బాధితుడు ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం తన బాధను పంచుకోవాలనే ఉద్దేశమే తప్ప ఇది ఎవరి ఒత్తిడిమీద పోస్ట్ చేసినవీడియో కాదనీ స్పష్టం చేశాడు. దీంతో ఇది వైరల్‌గామారింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక మహిళను షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో దాదాపు 18 గంటలు నిర్బంధించిన ఘటన, తీవ్ర నిరసనలువ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.
ఆన్‌లైన్‌లో ఆన్ రోడ్ ఇండియన్‌గా ప్రసిద్ధి చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిట్టల్ చైనాలో తనకెదురైన భయానక అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. చైనాలో గతంలో నిర్బంధించబడిన అరుణాచల్ ప్రదేశ్ పౌరుడికి సంఘీభావం తెలిపే వీడియోను పోస్ట్ చేయడంతోనే తనను చైనా అధికారులు దాదాపు 15 గంటల పాటు నిర్బంధించారని ఆరోపించాడు. ఈ వీడియోపై యూట్యూబర్ క్షమాపణలు కూడా చెప్పాడు.
నవంబర్ 16న మిట్టల్ చైనాలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఎపుడు మామూలుగా ప్రశ్నలిడిగి, క్లియర్ చేసే అధికారులు ఈ సారి ఇమ్మిగ్రేషన్ వద్ద తనను ఆపివేసినట్లు మిట్టల్ చెప్పారు. పాస్‌పోర్ట్‌పై వార్నింగ్ స్టిక్కర్ అంటించి, ఆ తరువాత పలువురు విదేశీ పౌరులను ఉంచిన నిర్బంధ ప్రాంతానికి తీసుకెళ్లారని తన సుదీర్ఘ వీడియోలో ఆరోపించాడు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌తో తనకున్న భావోద్వేగ సంబంధం మూడేళ్లు అక్కడ చదువుకోవడంతో ఏర్పడిందనీ , చైనాలో ఒక అరుణాచల్ పౌరుడిని నిర్బంధించారని విన్న తర్వాత తాను తీవ్రంగా ప్రభావితమై దాని గురించి మాట్లాడిన వీడియో తన నిర్బంధానికి కారణమైందన్నాడు.
దాదాపు రెండు గంటల పాటు ఏ అధికారి కూడా అతనితో మాట్లాడలేదు. తరువాత, అతన్ని మరొక గదిలోకి తీసుకెళ్లారు, అక్కడ ఏవీ రికార్డ్ చేయకుండా ఉండటానికి ఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్న అధికారులు తన ఐప్యాడ్‌ను పట్టించుకోలేదని తెలిపాడు. తన నిర్బంధంపై పదే పదే అడిగినా సమాచారం ఇవ్వడానికి నిరాకరించమే కాదు నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రమే కొద్దిగా నీళ్లిచ్చారు. అలా 12-13 గంటలయ్యేసరికి తనలో భయం మొదలైంది. దాదాపు 15 గంటల తర్వాత, ఒక చైనా అధికారి తిరిగి వచ్చి ప్రక్రియ పూర్తయిందని ,వెంటనే దేశం విడిచి వెళ్ళవలసి వచ్చిందని హెచ్చరించారు. ఇక దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదని అతను చెప్పాడు. ఎట్టకేలకు తాను సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు.
తానొక సాధారణ ట్రావెల్ వ్లాగర్ అని, తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, చైనాలో తన స్టార్టప్ రోజుల నుండి స్నేహితులు ఉన్నారని కూడా అన్నారు. "నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. నేను అందర్నీ ప్రేమిస్తున్నాను, నా కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని మీతో పంచుకుంటాను. నాకు ఏ రాజకీయ ఎజెండాతో సంబంధం లేదు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు. తనకు ఎటువంటి రాజకీయ అనుబంధాలు లేవని, అధికారులను రెచ్చగొట్టాలని ఎప్పుడూ ఉద్దేశించలేదని మిట్టల్ వాపోయాడు. ఇది రాస్తున్నంతసేపు కూడా తాను ఏడుస్తూనే ఉన్నాని కూడా రాసుకొచ్చాడు.భారత - చైనా రాయబార కార్యాలయాలు తాను అనుభవించిన భయాన్ని అర్థం చేసుకుంటాయని తాను ఆశిస్తున్నానని మిట్టల్ అన్నారు.
ఇదీ చదవండి: చిన్నారిపై పిట్‌బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియో
కాగా గతంలో చైనాలో మహిళను నిర్బంధించిన ఘటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. భారతీయ వ్యక్తిని ఏకపక్షంగా నిర్బంధించడం తగదని హితవు చెప్పింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ "భారతదేశంలో అంతర్భాగం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. చైనా ఎంత తిరస్కరించినా ఈ సత్యాన్ని మార్చలేమని కూడా స్పష్టం చేసింది. తాజా సంఘటనపై భారత అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు.
ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్


