జపాన్‌ను వణికిస్తున్న జంట తుఫానులు | Twin Tropical Storms Disrupt Air Travel in Japan 120 Flights Axe | Sakshi
Sakshi News home page

జపాన్‌ను వణికిస్తున్న జంట తుఫానులు

Jun 27 2026 8:07 AM | Updated on Jun 27 2026 9:08 AM

Twin Tropical Storms Disrupt Air Travel in Japan 120 Flights Axe
  • 120కి పైగా విమానాలు రద్దు
  • ప్రమాదకరంగా ‘ఫుజివారా ఎఫెక్ట్’ 
  • 10 లక్షల మందికి తరలింపు హెచ్చరికలు
  • మెక్ఖాలా, హిగోస్ బీభత్సం
  • అతలాకుతలమైన విమాన సర్వీసులు

టోక్యో: జపాన్‌ను జంట తుఫానులు వణికిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘మెక్ఖాలా', ‘హిగోస్’ అనే రెండు ఉష్ణమండల తుఫానుల కారణంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా శని, ఆదివారాల్లో ప్రయాణించాల్సిన కనీసం 120 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి.

రద్దయిన సర్వీసులు.. నిలిచిన సైనిక విమాన ప్రయోగాలు
జపాన్‌కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థలు ‘జపాన్ ఎయిర్‌లైన్స్’, ‘ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్’ ప్రధానంగా ఓకినావా, కాగోషిమా వంటి దక్షిణ ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేశాయి. గంటకు 108 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, భారీ వర్షాల వల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ వాతావరణ ప్రభావం వాణిజ్య విమానాలకే పరిమితం కాలేదు. అమెరికాతో కలిసి నిర్వహించాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలలో భాగంగా మియాకో ద్వీపానికి బయలుదేరాల్సిన ‘వీ-22 ఓస్ప్రే’ సైనిక రవాణా విమానం తొలి ప్రయాణాన్ని కూడా రక్షణ శాఖ వాయిదా వేసింది.

అరుదైన ‘ఫుజివారా ఎఫెక్ట్’.. ఊహించని ముప్పు
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ రెండు తుఫానుల వల్ల అత్యంత అరుదైన ‘ఫుజివారా ఎఫెక్ట్’  ఏర్పడే అవకాశం ఉంది. రెండు తుఫానులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ కలిసి ప్రయాణిస్తాయి. దీనివల్ల తుఫానుల ఖచ్చితమైన దిశను, వేగాన్ని, తీవ్రతను అంచనా వేయడం అత్యంత కష్టతరంగా మారుతుంది. తైవాన్‌లో ఇప్పటికే ఇద్దరి ప్రాణాలను బలితీసుకుని, 88 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేసిన ‘మెక్ఖాలా’ తుఫాను బలహీనపడినప్పటికీ, ఈ అరుదైన వాతావరణ ప్రక్రియ వల్ల జపాన్‌లోని ఒసాకా, నాగోయా, టోక్యో వంటి ప్రధాన నగరాలకు భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

 

 

10 లక్షల మందికి హెచ్చరికలు.. వరద గుప్పిట్లో నగరాలు
తుఫానుల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు ఆదేశించారు. కాగోషిమా ప్రాంతంలో ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలు నీట మునిగాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒసాకా, క్యోటో నగరాల్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి: కంగారు లేని ప్రయాణం.. మనసుకు నచ్చిన నిశ్శబ్దం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement