బాంబులు పడ్డాయి.. భవనాలు నేలమట్టమయ్యాయి.. కొండపై భారీ గుంత ఏర్పడింది.. అంతా ముగిసిపోయిందనుకున్నారంతా! కానీ.. కొన్ని నెలలు గడిచేసరికి అక్కడ మళ్లీ వాహనాలు తిరుగుతున్నాయి.. శిథిలాలు తొలగిపోతున్నాయి.. భూమిలో భారీ యంత్రాలు పనిచేస్తున్నాయి! అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇరాన్ మళ్లీ అణ్వాయుధ కార్యక్రమాన్ని పట్టాలెక్కిస్తోందా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రశ్న!
ఇది సాధారణ సైనిక స్థావరం కాదు. టెహ్రాన్‌కు ఈశాన్యంగా ఉన్న మిన్‌జదాయీ (Minzadayi) ప్రాంతంలోని అత్యంత రహస్యమైన సముదాయం. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన కీలక పనులు ఇక్కడ జరిగేవని ఇజ్రాయెల్ గతంలో ఆరోపించింది. 2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ప్రాంతంలోని పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని భూగర్భ నిర్మాణాలు కూడా ప్రభావితమైనట్లు అంచనాలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు సీన్ మారింది!
సెప్టెంబర్ ప్రారంభంలో తీసిన హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాల్లో మిన్‌జదాయీలో మళ్లీ కదలికలు కనిపించాయి. ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్నారు. బాంబు పడటంతో ఏర్పడిన గుంతను పూడ్చేశారు. భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అంతేకాదు.. గతంలో ఖాళీగా కనిపించిన పార్కింగ్ ప్రాంతాల్లో మళ్లీ కార్లు, ట్రక్కులు కనిపించాయి. సెక్యూర్ పరిధిలోనూ వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇవన్నీ సాధారణ పునర్నిర్మాణ పనులేనా? లేక ఇజ్రాయెల్ దాడులతో దెబ్బతిన్న అణు కార్యక్రమాన్ని ఇరాన్ మళ్లీ పునరుద్ధరిస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
మళ్లీ మొదలైందా?
అమెరికాకు చెందిన Institute for Science and International Security తాజా శాటిలైట్ చిత్రాలను విశ్లేషించింది. మిన్‌జదాయీలో జరుగుతున్న పునరుద్ధరణ చర్యలు.. అక్కడ చేపట్టే కార్యకలాపాలకు ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. అయితే చిత్రాల్లో కనిపిస్తున్న కదలికలే అణ్వాయుధ తయారీ తిరిగి ప్రారంభమైందని నిర్ధారించవని కూడా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో అణ్వాయుధ వ్యవస్థలకు అవసరమైన కీలక భాగాలపై శాస్త్రవేత్తలు పనిచేసేవారు. మరో మధ్యప్రాచ్య భద్రతా సంస్థ విశ్లేషణ ప్రకారం.. 2022లో ఏర్పాటైన ఈ కేంద్రం అణ్వాయుధాలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి మౌలిక వసతుల పునర్నిర్మాణానికి ఉపయోగపడుతోంది.

దాడులతో ఆపలేకపోయారా?
ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ 2026 ఫిబ్రవరి 28 నుంచి దాడులు ప్రారంభించాయి. ఆ దాడులు ఇరాన్ అణు మౌలిక వసతులకు భారీ నష్టం కలిగించాయి. అనంతరం జరిగిన శాంతి చర్చల్లోనూ అమెరికా కీలక షరతులు విధించింది. అధిక స్థాయి యురేనియం శుద్ధిని శాశ్వతంగా నిలిపివేయాలని.. భవిష్యత్తులో అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే ఈ అంశాల్లో ఇరాన్ పూర్తిగా అంగీకరించకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదు.
ఇప్పుడు అసలు టెన్షన్ ఇదే!
ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు అణు కేంద్రాలపై నిఘా.. ఇంకోవైపు దాడికి గురైన రహస్య స్థావరాల్లో మళ్లీ కదలికలు.. ఇప్పుడు ఇదే విషయం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇజ్రాయెల్ బాంబులతో నేలమట్టమైనట్లు కనిపించిన మిన్‌జదాయీ.. ఇప్పుడు మళ్లీ ఎందుకు మేల్కొంటోంది? అక్కడ జరుగుతున్నది కేవలం శిథిలాల తొలగింపా? లేక ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరోసారి రహస్యంగా పట్టాలెక్కించే ప్రయత్నమా?. ప్రస్తుత శాటిలైట్ చిత్రాలు కార్యకలాపాలు పునఃప్రారంభమైన సంకేతాలను చూపుతున్నప్పటికీ.. అవి అణ్వాయుధ కార్యక్రమం తిరిగి మొదలైందని నిర్ధారించవు. అయినా.. ప్రపంచం చూపు ఇప్పుడు మరోసారి ఇరాన్ వైపే ఉంది.
📍 Uydu görüntüleri, mart ayında İsrail saldırısına uğrayan Tahran’ın kuzeydoğusundaki Minzadayi yerleşkesinde araç hareketliliği, enkaz kaldırma, onarım ve toprak çalışmalarının yeniden yoğunlaştığını ortaya koydu. -Vantor Technologies https://t.co/vXWaj4KNR2
— SavunmaTR (@SavunmaTR) October 7, 2026
ఇదీ చదవండి: సౌదీకి కొత్త భయం.. పాక్ వల్ల సాధ్యమేనా?


