సౌదీకి పాక్‌ బలగం.. హౌతీలను ఓడించే దమ్ముందా? | Saudi Houthi Issue Pakistan turkey defence support Full Details | Sakshi
Sakshi News home page

సౌదీకి పాక్‌ బలగం.. హౌతీలను ఓడించే దమ్ముందా?

Oct 7 2026 7:27 AM | Updated on Oct 7 2026 8:25 AM

Saudi Houthi Issue Pakistan turkey defence support Full Details

యెమెన్‌లో హౌతీలతో కొనసాగుతున్న ఘర్షణ మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది. సౌదీ అరేబియాపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్, టర్కీ సైనిక సహకారం కీలకంగా మారుతోంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం నేపథ్యంలో రియాద్‌కు మద్దతుగా ఇస్లామాబాద్, అంకారా రంగంలోకి దిగే పరిస్థితి ఏర్పడింది. అయితే మూడు దేశాల సైనిక బలం ఒక్కటైతే హౌతీలను పూర్తిగా ఓడించగలరా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

2015లో పాకిస్తాన్ నిర్ణయం ఇదే..
హౌతీలపై పోరాటం కోసం 2015లో సౌదీ అరేబియా పాకిస్తాన్‌ను యుద్ధ విమానాలు, నౌకలు, భూదళాలను పంపాలని కోరింది. ఈ అంశంపై పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఐదు రోజుల పాటు తీవ్ర చర్చ జరిగింది. యెమెన్‌లోకి సైన్యాన్ని పంపితే ప్రాంతీయ యుద్ధంలో పాక్‌ చిక్కుకునే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. చివరకు 2015 ఏప్రిల్ 10న పాకిస్తాన్‌ పార్లమెంట్ ఏకగ్రీవంగా యెమెన్ యుద్ధంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. అయితే, సౌదీ అరేబియా భౌగోళిక సమగ్రతకు లేదా మక్కా, మదీనా పవిత్ర ప్రాంతాలకు ముప్పు ఏర్పడితే సౌదీకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది.

అయితే, ఇప్పటి పరిస్థితుల్లో సౌదీ-పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్‌, టర్కీ మధ్య కుదిరిన సంయుక్త రక్షణ(మక్కా) ఒప్పందం ప్రకారం ఒక దేశంపై సాయుధ దాడిని మిగతా దేశాలపై దాడిగా పరిగణించే విధానం ఏర్పడింది. హౌతీల డ్రోన్లు, క్షిపణులు సౌదీ భూభాగంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రక్షణ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో సౌదీ రక్షణకు పాకిస్తాన్‌, టర్కీ నుంచి సైనిక సహకారం అందే అవకాశాలపై చర్చ మొదలైంది.

మూడు దేశాల వద్ద భారీ సైనిక శక్తి
సౌదీ అరేబియా ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసే దేశాల్లో ఒకటి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, ఇతర అధునాతన ఆయుధాలు ఆ దేశం వద్ద ఉన్నాయి. పాకిస్తాన్‌కు భారీ స్థాయిలో భూ దళాలు, వైమానిక దళం, సుదీర్ఘ సైనిక అనుభవం ఉంది. టర్కీకి NATO అనుభవంతో పాటు డ్రోన్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వంటి రంగాల్లో బలమైన రక్షణ సామర్థ్యం ఉంది. కాగితంపై చూస్తే సౌదీ, పాకిస్తాన్, టర్కీ సైనిక సామర్థ్యం హౌతీల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ యెమెన్‌లో పరిస్థితులు అంత సులభంగా లేవని నిపుణులు చెబుతున్నారు.

పర్వతాలు.. గుహలు.. మొబైల్ క్షిపణులు
హౌతీలకు ఉత్తర యెమెన్ భౌగోళిక పరిస్థితులు ప్రధాన బలంగా మారాయి. పర్వతాలు, లోయలు, గుహలు, భూగర్భ స్థావరాలను వారు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. మొబైల్ క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, వికేంద్రీకృత కమాండ్ వ్యవస్థతో దాడులు చేస్తున్నారు. భారీ సైన్యాన్ని యెమెన్‌లోకి పంపితే యుద్ధం మరింత సంక్లిష్టమవుతుంది. సైనికులతో పాటు ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రి సరఫరా మార్గాలను కూడా రక్షించాల్సి ఉంటుంది. ఈ మార్గాలపై హౌతీలు దాడులు చేసే అవకాశం ఉంటుంది. హౌతీలను ఓడించేందుకు సౌదీ ఇప్పటికే భారీ వైమానిక దాడులు నిర్వహించింది. 2015 నుంచి సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్‌లో హౌతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అయినప్పటికీ హౌతీల సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం సాధ్యం కాలేదు. తర్వాత అమెరికా, బ్రిటన్ కూడా హౌతీ స్థావరాలపై దాడులు చేశాయి. అయినప్పటికీ డ్రోన్లు, క్షిపణుల ప్రయోగ సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించలేకపోయాయి. దీంతో కేవలం వైమానిక శక్తితో హౌతీలను ఓడించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దాయాదికి సవాలే.. 
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ సొంత దేశంలోనే దశాబ్దాలుగా తిరుగుబాటు, ఉగ్రవాద సమస్యలను ఎదుర్కొంటోంది. టెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)పై సుదీర్ఘంగా పోరాడుతున్నప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. అయితే టీటీపీ, హౌతీలు ఒకే రకమైన సంస్థలు కావు. వాటి లక్ష్యాలు, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ నేపథ్యాలు వేర్వేరుగా ఉన్నాయి. అయినప్పటికీ, ఒక బలమైన సైన్యానికి కూడా పాతుకుపోయిన సాయుధ సంస్థను పూర్తిగా ఓడించడం ఎంత కష్టమో ఈ ఉదాహరణ తెలియజేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

పరిమిత లక్ష్యాలతోనే ముందుకు?
యెమెన్‌లో పూర్తి స్థాయి భూ యుద్ధానికి బదులుగా సౌదీ వైమానిక రక్షణను బలోపేతం చేయడం, నిఘా వ్యవస్థలను మెరుగుపరచడం, యెమెన్ ప్రభుత్వ దళాలకు మద్దతు ఇవ్వడం, ఎర్ర సముద్ర తీరాన్ని రక్షించడం వంటి పరిమిత లక్ష్యాలకే పాకిస్తాన్, టర్కీ సహకారం పరిమితం చేయాలని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. సనా, సాదా, ఉత్తర యెమెన్ పర్వత ప్రాంతాల్లోకి భారీ సైన్యాన్ని పంపడం వల్ల యుద్ధం మరింత సంక్లిష్టమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. హౌతీలు కేవలం చిన్న మిలీషియా కాకుండా ఉత్తర, పశ్చిమ యెమెన్‌లో విస్తారమైన ప్రాంతాన్ని నియంత్రిస్తున్న రాజకీయ, సైనిక శక్తిగా ఎదిగారు. పర్వత భూభాగం, భూగర్భ స్థావరాలు, డ్రోన్లు, క్షిపణులు, స్థానిక మద్దతు, సుదీర్ఘ పోరాట సామర్థ్యం వారికి బలంగా ఉన్నాయి. సౌదీ, పాకిస్తాన్, టర్కీ కలిసి సౌదీ రక్షణను బలోపేతం చేసి హౌతీల దాడులను అడ్డుకోగలిగినా, వారిని పూర్తిగా నిర్మూలించడం మాత్రం అంత సులభం కాదు. 2015లో యుద్ధానికి దూరంగా ఉన్న పాకిస్తాన్‌ ఇప్పుడు సౌదీ రక్షణలో మరింత కీలక పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడినా, యెమెన్ అనుభవం సైనిక బలంతో మాత్రమే హౌతీల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని సూచిస్తోంది.

ఇదీ చదవండి: ట్రంప్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement