ఏఐతో ఓ చిన్నదేశం.. పెద్ద అద్భుతాలు! మరి మనం? | Rwanda's AI Revolution: A Small Country a Big Lesson for India | Sakshi
Sakshi News home page

ఏఐతో ఓ చిన్నదేశం.. పెద్ద అద్భుతాలు! మరి మనం?

Oct 7 2026 1:54 PM | Updated on Oct 7 2026 2:16 PM

Rwanda's AI Revolution: A Small Country a Big Lesson for India

కృత్రిమ మేధ.. ఈ మాట ఇప్పుడు ఎవరి నోట విన్నా వినిపిస్తోంది. ఫోన్‌లో ఫొటోలు మార్చుకోవడం దగ్గర నుంచి కథలు, పాటలు, వీడియోలు తయారు చేసుకోవడం వరకు ఆ సాంకేతికత మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఒక చిన్న దేశం మాత్రం ఏఐని మరో స్థాయిలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. రైతు పొలంలో ఏ పురుగు వచ్చిందో చెప్పడం నుంచి విద్యార్థి చదువు మానేసే ప్రమాదాన్ని ముందే గుర్తించడం వరకు.. వైద్య సేవల నుంచి ప్రభుత్వ నిర్ణయాల వరకు.. ప్రజల సమస్యలకు ఉపయోగిస్తోంది.

ఆ దేశమే రువాండా. ఆఫ్రికాలోని చిన్న దేశం. జనాభా, ఆర్థిక శక్తి, వనరుల విషయంలో భారత్‌తో పోల్చితే చాలా చిన్నది. అయినా AI విషయంలో అది పెట్టుకున్న లక్ష్యం మాత్రం పెద్దది. AIని కేవలం కొత్త టెక్నాలజీగా కాకుండా దేశ అభివృద్ధికి ఉపయోగపడే సాధనంగా మార్చాలని రువాండా జాతీయ విధానాన్ని రూపొందించుకుంది. 

రైతుకు 24 గంటలూ సలహా
రువాండాలో వ్యవసాయానికి సంబంధించిన ఓ ఏఐ వ్యవస్థను ప్రయోగిస్తున్నారు. రైతు తన భాష కిన్యారువాండాలో ప్రశ్న అడిగితే.. పంటకు వచ్చిన తెగులు, వ్యాధులు, వాతావరణ పరిస్థితులపై సలహా ఇచ్చేలా దీన్ని రూపొందించారు. అంటే రైతు ‘‘నా పంటకు ఈ సమస్య వచ్చింది.. ఏం చేయాలి?’’ అని అడిగితే సమాధానం చెప్పే సాంకేతికత.

మన దేశంలో కూడా వ్యవసాయానికి AI ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ రువాండా ప్రత్యేకత ఏమిటంటే.. తన దేశ ప్రజలు మాట్లాడే భాషలో, వారి రోజువారీ సమస్యకు నేరుగా ఉపయోగపడేలా AIని రూపొందించడం.

పిల్లాడు బడికి దూరమా?.. అలర్ట్‌
రువాండా ఏఐని విద్యారంగంలోనూ ప్రయోగిస్తోంది. విద్యార్థి చదువు మధ్యలోనే ఆపేసే ప్రమాదం ఉందా? అనే విషయాన్ని ముందుగానే గుర్తించే AI మోడల్‌ను ప్రయోగిస్తున్నారు. అలాగే విద్యార్థుల స్థాయికి అనుగుణంగా గణితాన్ని బోధించే అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ట్యూటరింగ్‌ వ్యవస్థను కూడా పరీక్షిస్తున్నారు. అంటే పిల్లాడు స్కూల్‌ మానేసిన తర్వాత సమస్యను గుర్తించడం కాదు.. ఆ పిల్లాడు చదువు మానేసే అవకాశం ఉంది అని ముందే పట్టించుకోండి అని వ్యవస్థ హెచ్చరించే దిశగా ఆలోచన.

ఆస్పత్రికి వెళ్లకముందే AI సాయం
ఆరోగ్య రంగంలోనూ రువాండా ఏఐతో ప్రయోగాలు చేస్తోంది. జాతీయ టెలీమెడిసిన్‌ సేవలో దాని ఆధారిత ప్రాథమిక పరిశీలన, వైద్య నిర్ణయాలకు సహాయక వ్యవస్థలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో వైద్యులకు చికిత్స నిర్ణయాల్లో సహాయపడే టూల్స్‌ను ప్రయోగిస్తున్నారు. అలాగని అదేం వైద్యుడిని పూర్తిగా భర్తీ చేయడం లక్ష్యం కాదు. వైద్యుడికి మరింత సమాచారం అందించి నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేయడం మాత్రమే!.

రక్తం.. మందులు డ్రోన్లతో!
ఇంకో ఆసక్తికరమైన ఉదాహరణ రువాండాలో ఇప్పటికే అమల్లో ఉన్న స్వయంచాలక డ్రోన్‌ ద్వారా మందులు, రక్తం వంటి వైద్య సామగ్రి పంపిణీ. రోడ్లు, దూర ప్రాంతాలు, అత్యవసర పరిస్థితులు అడ్డంకిగా మారినప్పుడు.. డ్రోన్లను ఉపయోగించి వైద్య సరఫరాలు చేరవేసే వ్యవస్థను అక్కడ విస్తరించారు. 

ప్రభుత్వానికి కూడా.. 
రువాండా ఏఐని ఒకటి రెండు శాఖల ప్రయోగంగా వదిలేయకుండా.. పాలనలో భాగంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పని కేవలం ఈ టెక్నాలజీపై చర్చించడం కాదు.. ప్రభుత్వంలో ఏఐ అమలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పాలన, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలను సమన్వయం చేయడం. 

ఇంకా ముందుకు వెళ్లి.. ప్రభుత్వ నిర్ణయాలు ‘‘గతంలో ఏం జరిగింది?’’ అనే నివేదికలపై మాత్రమే ఆధారపడకుండా, ‘‘ఇప్పుడు ఏం జరుగుతోంది? తర్వాత ఏం జరగొచ్చు?’’ అనే అంచనాలకు AI, డేటాను ఉపయోగించే దిశగా ఆ దేశం ప్రణాళికలు రూపొందిస్తోంది. 

మరి మన దగ్గర?
పేద దేశమైన రువాండాలోనే కాదు.. రిచ్చెస్ట్‌ ఎకానమీ ఉన్న సింగపూర్‌లోనూ దాదాపు ఏఐ వినియోగం ఇదే స్థాయిలో నడుస్తోంది. ఇక్కడే మనం ఒక్కసారి ఆగి ఆలోచించాలి. భారత్‌  ఆ విషయంలో వెనుకబడిన దేశం కాదు. ఇండియాఏఐ మిషన్‌(IndiaAI Mission) ద్వారా కంప్యూటింగ్‌ వనరులు, డేటా, స్వదేశీ AI మోడళ్లు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లకు మద్దతు వంటి రంగాల్లో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోంది. ప్రభుత్వ విభాగాల్లోనూ AI వినియోగానికి ప్రణాళికలు ఉన్నాయి. అంటే సమస్య ‘‘భారత్‌ AIని పట్టించుకోవడం లేదు’’ అనేది కాదు.

కానీ, మనం AIని ఎంతగా, ఎటువైపు ఉపయోగిస్తున్నాం?.. అదే అసలు ప్రశ్న

సినిమాల్లో హీరో ముఖాన్ని, హీరోయిన్లను అశ్లీలంగా మార్చడానికి..

సోషల్‌ మీడియాలో నకిలీ వీడియోలు చేయడానికి.. 

రాజకీయ ప్రచారంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి..

క్లిక్‌ల కోసం సంచలన కంటెంట్‌ తయారు చేయడానికి..

నకిలీ ఫొటోలు, డీప్‌ఫేక్‌లు సృష్టించడానికి! ఇలా..

కానీ అదే టెక్నాలజీతో.. 

ఒక రైతుకు సరైన సమయంలో సలహా ఇవ్వగలమా?

ఒక పేద విద్యార్థి చదువు మానేయకుండా ముందే గుర్తించగలమా?

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడికి అదనపు సహాయం అందించగలమా?

వరదలు, కరువు, కాలుష్యం వంటి సమస్యలను ముందుగానే అంచనా వేయగలమా?

ప్రభుత్వ పథకం నిజంగా ఎవరికి చేరడం లేదో డేటా ద్వారా గుర్తించగలమా?

ఏఐ వచ్చిన తర్వాత మనం తరచూ ‘‘ఎన్ని ఉద్యోగాలు పోతాయి?’’ అని అడుగుతున్నాం. ‘‘ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?’’ అని కూడా చర్చిస్తున్నాం. కానీ మరో ప్రశ్న కూడా ఉండాలి. దాని వల్ల సామాన్యుడి జీవితం ఎంత సులభమవుతుంది?. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న దేశాల్లో రువాండా ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. ఆ దేశం AI కోసం ప్రత్యేక విధానం, సంస్థలు, డేటా వ్యవస్థలు, నైపుణ్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. 2026లో ప్రభుత్వం AIని ఆరోగ్యం, విద్య, ప్రభుత్వ సేవల్లో బాధ్యతాయుతంగా ఉపయోగించేందుకు ఆంత్రోపిక్‌(Anthropic)తో మూడేళ్ల భాగస్వామ్యాన్నీ ప్రకటించింది.

చిన్న దేశం.. మనకు పెద్ద పాఠం
రువాండా మనకంటే పెద్ద దేశం కాదు. మనకంటే ఎక్కువ వనరులున్న దేశం కూడా కాదు. కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతోంది. ఏఐ అంటే ఫొటోలు, వీడియోలు జనరేట్‌ చేసుకోవడం కాదు. ఫేక్‌ వీడియోలు చేయడం కాదు. ఎన్నికల ప్రచారానికి కొత్త ఆయుధం అంతకంటే కాదు. దానిని సరిగ్గా ఉపయోగిస్తే రైతుకు సలహాదారు కావొచ్చు. విద్యార్థికి గురువు కావొచ్చు. డాక్టర్‌కు సహాయకుడు కావొచ్చు. ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ కావొచ్చు. సామాన్యుడికి వేగవంతమైన సేవ కావొచ్చు. మన దగ్గర కూడా ఆ సామర్థ్యం ఉంది. సాంకేతిక నిపుణులు ఉన్నారు. డేటా ఉంది. ప్రతిభ ఉంది. భారీ మార్కెట్ ఉంది. కావాల్సింది ఒక్కటే..

ఏఐని ఎవరి వినోదానికి ఉపయోగిస్తున్నాం?. ఎవరి రాజకీయ ప్రయోజనానికి ఉపయోగిస్తున్నాం?. ఎవరి లాభానికి ఉపయోగిస్తున్నాం?. అన్నింటికంటే ముఖ్యంగా.. ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం?. రువాండా లాంటి చిన్న దేశం ఈ ప్రశ్నకు తనదైన సమాధానం వెతుకుతోంది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌.. AI యుగంలో సామాన్యుడి జీవితాన్ని మార్చే తదుపరి అడుగు ఎప్పుడు వేస్తుంది?. 

:::వెబ్‌ డెస్క్‌ ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement