న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు వెనుక పాక్ హస్తం ఉందని స్పష్టం అయ్యింది. ఈ దాడితో పాకిస్తాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందంటూ ఆ దేశ రాజకీయ నేత ఒకరు బహిరంగంగా ప్రకటించడంతో దాయాది దేశం తీరు మరోమారు బయటపడింది. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మంత్రి చౌదరి అన్వరుల్ హక్ పీఓకే అసెంబ్లీలో మాట్లాడుతూ ‘భారతదేశం ఉద్దేశపూర్వకంగా బలూచిస్తాన్‌లో అశాంతిని రేకెత్తిస్తే, తాము ఎర్రకోట నుండి కశ్మీర్ అడవుల వరకు దాడి చేస్తామని ముందే చెప్పామని, అల్లా దయతో మేము దీనిని చేసి చూపామని’ వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ అధికారికంగా ఈ ప్రకటనపై స్పందించనప్పటికీ, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశంతో యుద్ధం అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. కాగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భారత్ అశాంతిని రేకెత్తిస్తోందన్న ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది.
ఢిల్లీ పేలుడు కోసం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన ఇస్లామిక్ మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ 10 మంది సభ్యుల సెల్‌ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. అలాగే పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది ఉమర్ బిన్ ఖత్తాబ్ అలియాస్ హంజుల్లా దీనికి ఆర్గనైజర్ గా వ్యవహరించాడని వెల్లడయ్యింది. ఎన్‌ఐఏ అధికారులు ఈ సెల్‌లోని సభ్యులందరినీ అరెస్టు చేశారు. మరోవైపు ఈ పేలుడు తర్వాత జైష్ నేతలు భారతదేశంపై మరిన్ని దాడులు చేసేందుకు నిధులు కావాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకోసం వారు ‘సదాపే’యాప్ ద్వారా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ఎన్‌ఐఏ దాడులతో జైష్ నేతల చర్యలకు అడ్డుకట్ట పడింది.
ఇది కూడా చదవండి: యూరప్‌లో ‘హమాస్’ కుట్ర.. భగ్నం చేసిన ‘మొసాద్’


