రష్యా ‘డ్రోన్ దాడి’ ఆరోపణలను ఖండించిన ట్రంప్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి దిగిందంటూ వచ్చిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. రష్యా అధ్యక్షుడి నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. పుతిన్ నివాసానికి సమీపంలో ఏదో జరిగిందని, అయితే అది పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగింది కాదని తమ అధికారులు చెప్పారన్నారు.
ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో నివాసంలో రెండు వారాల విశ్రాంతి ముగించుకున్న ట్రంప్ సోమవారం వాషింగ్టన్‌కు వస్తూ తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు.
‘మొదట్లో ఉక్రెయిన్ దాడి విషయం మేం కూడా నమ్మాం. కానీ, ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. అలాంటి దాడి ఏదీ జరగలేదని నిర్ధారణ అయింది’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్రతిపాదిత రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అమెరికాలో చర్చలు జరుగుతున్న వేళ..పుతిన్ తనతో ఫోన్‌లో మాట్లాడారని, డ్రోన్ దాడి జరిగినట్లు చెప్పడంతో తనకు చాలా కోపం వచ్చిందని సోమవారం ట్రంప్ తెలపడం తెల్సిందే.
అనంతరం, శాంతి చర్చలను తప్పుదోవ పట్టించేందుకే రష్యా ఈ అబద్ధం చెప్పిందటూ న్యూయార్క్ పోస్ట్‌లో వచ్చిన కథనాన్ని బుధవారం ఆయన షేర్ చేశారు. శాంతి చర్చలు పురోగతిలో ఉన్నట్లు ట్రంప్, జెలెన్‌స్కీ ప్రకటించినా రష్యా మాత్రం తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక డోన్బాస్ ప్రాంతం మొత్తం తనకే చెందాలని, యుద్ధానంతరం ఆ దేశం పరిమితంగా సైన్యాన్ని ఉంచుకోవాలని షరతులు విధిస్తోంది.


