ఇస్లామాబాద్: ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టడంతోపాటు సమూల మార్పులకు ఉద్దేశించిన 27వ రాజ్యాంగ సవరణకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేయగా, ప్రతిపక్ష పార్టీలు ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగాయి. రాజ్యాంగ పునాదులనే కదిలించే సవరణలను ఆపివేయాలని డిమాండ్ చేశాయి. 27వ రాజ్యాంగ సవరణతో మిలటరీ అధికారం మరింత బలపడనుంది.
ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల చీఫ్‌గా రాజ్యాంగ గుర్తింపు లభించనుంది. ఫీల్డ్ మార్షల్‌గా ఆయన జీవిత కాలం కొనసాగుతారు. దీనివల్ల జీవించి ఉన్నంతకాలం ఆయనపై కేసులు పెట్టకూడదు. సుప్రీంకోర్టు అధికారాలకు సైతం కోత పడనుంది. ఈ బిల్లుపై సోమవారం సెనేట్‌లో ఓటింగ్ జరగనుంది. అవసరమైన మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమాతో ఉంది. దీనిపై ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ సహా ఐదు పార్టీల కూటమి నిరసనలను కొనసాగించాలని నిర్ణయించింది.


