వందేళ్లకొకసారి సంభవించే అరుదైన భూకంపం! | Once in a Century Seismic Doublet: Venezuela Hit by Twin Quakes | Sakshi
Sakshi News home page

వందేళ్లకొకసారి సంభవించే అరుదైన భూకంపం!

Jun 25 2026 11:05 AM | Updated on Jun 25 2026 11:16 AM

Once in a Century Seismic Doublet: Venezuela Hit by Twin Quakes

వామ్మో.. భూమి రెండుగా చీలిపోయిందా? అన్నట్లు వెనెజువెలా వణికిపోయింది. జంట భూకంపాలు రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ భవనాలు ఊగిపోతూ కుప్పకూలిపోగా.. సుదూరాన ఉన్న కొలంబియా దేశ రాజధాని బోగొటాలో ఆ ప్రకంపనల ప్రభావం కనిపించింది. వేల నుంచి లక్ష వరకు మరణాలు ఉండొచ్చన్న అంచనాల మధ్య దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇంతటి భారీ విధ్వంసానికి కారణమైన ఈ రెండు భూకంపాలు.. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే ఎలా సంభవించాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

దక్షిణ అమెరికా దేశం వెనిజువెలా భూకంపాల దెబ్బకు అతలాకుతలమైంది. మొదట 7.1 తీవ్రతతో భూమి కంపించగా, ఆ భయం తగ్గకముందే కేవలం 39 సెకన్లలోనే 7.5 తీవ్రతతో రెండో భారీ ప్రకంపన అదే ప్రాంతాన్ని తాకింది. ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు కలిసి దేశాన్ని కుదిపేసి, ప్రజలను వీధుల్లోకి పరుగులు తీయించాయి. సాధారణంగా ఒక భారీ భూకంపం సంభవించిన తర్వాత భూమి లోపల ఒత్తిడి కొంతవరకు విడుదలవుతుంది. ఆ తర్వాత చిన్నచిన్న ఆఫ్టర్‌షాక్‌లు మాత్రమే వస్తాయి. కానీ వెనెజువెలా ప్రకంపనల పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. 

రెండు పెద్ద భూకంపాలు వరుసగా రావడంతో విధ్వంసం రెట్టింపైంది. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్‌, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను శాస్త్రవేత్తలు ‘‘సిస్మిక్‌ డబ్లెట్‌” (Earthquake Doublet)’’ గా పేర్కొన్నారు. అంటే ఒకే ప్రాంతంలో ఉన్న భూగర్భ చీలికలు లేదంటే ఫాల్ట్‌ లైన్లు చాలా తక్కువ వ్యవధిలో విడివిడిగా విరగడం. సాధారణంగా ఒక భూకంపం తర్వాత మరొకటి గంటలు లేదంటే రోజుల గ్యాప్‌తో వస్తాయి. కానీ ఇక్కడ కేవలం 39 సెకన్లలోనే రెండో భారీ భూకంపం రావడం ఈ ఘటనను అరుదైనదిగా మార్చింది.

వెనెజువెలాలో మొదటి భూకంపం తర్వాత పక్కనున్న భూగర్భ చీలికలపై ఒత్తిడి పెరిగి, వెంటనే రెండో భారీ భూకంపం సంభవించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. ఒత్తిడి తట్టుకోలేక సమీపంలోని మరో చీలిక కూడా కదలడంతో రెండో భూకంపం వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.

వెనెజువెలా భౌగోళికంగా అత్యంత ప్రమాదకర భూకంప జోన్‌లో ఉంది. కరీబియన్ ప్లేట్ మరియు దక్షిణ అమెరికా ప్లేట్ కలిసే ప్రాంతంలో ఈ దేశం ఉంది. ఈ రెండు భూభాగాలు నిరంతరం ఒకదానికొకటి స్లైడ్ అవుతూ కదులుతుంటాయి. ఈ కదలికల వల్ల భూగర్భంలో భారీ ఒత్తిడి ఏర్పడి, అది ఒక్కసారిగా విడుదలైనప్పుడు శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి.

బొకోనో, సాన్ సెబాస్టియన్, ఎల్ పిలార్, మోరోన్ వంటి అనేక ఫాల్ట్ జోన్లు పరస్పరం అనుసంధానమై ఉండటంతో, ఒక ప్రాంతంలో జరిగిన కదలిక మరో ప్రాంతాన్ని కూడా వెంటనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదే ఈసారి రెండు భారీ ప్రకంపనలు వరుసగా రావడానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రస్తుతం వెనెజువెలా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సహాయక బృందాలు శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. ఈ డబ్లెట్‌ భూకంపాల తర్వాత ఆఫ్టర్‌షాక్‌ల ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని యూఎస్‌జీఎస్‌ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బలహీనమైన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలను బయటే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సాధారణంగా వందేళ్లకు ఒకసారి లేదంటే అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి తీవ్ర స్థాయి జంట భూకంపాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో సాధారణంగా మొదటి భూకంపం తర్వాత భూగర్భ ఒత్తిడి సమీప ఫాల్ట్‌లకు బదిలీ అవుతుంది. ఆ ఒత్తిడి వెంటనే విడుదలైతే రెండో పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఇండోనేషియా, ఇరాన్, అమెరికాలోనూ ఎర్త్‌క్వేక్ డబ్లెట్ చోటు చేసుకున్నాయి. అయితే వెనిజువెలాలో ఈసారి కేవలం 39 సెకన్లలోనే రెండు భారీ ప్రకంపనలు రావడం భూమి లోపల ఉన్న ఒత్తిడి ఎంత అస్థిరంగా ఉందో చూపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదీ చదవండి: జంట భూకంపాల దెబ్బ.. లక్ష మంది మృతి?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement