జంట భూకంపాల దెబ్బ.. వెనెజువెలాలో భారీగా మృతులు? | 39 Seconds, Two Massive Quakes, Venezuela Battles Widespread Destruction And Growing Casualty Fears, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Venezuela Earthquake: జంట భూకంపాల దెబ్బ.. వెనెజువెలాలో భారీగా మృతులు?

Jun 25 2026 8:40 AM | Updated on Jun 25 2026 2:03 PM

Venezuela Reels After Seismic Doublet Massive Casualties Feared

దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండేలా కనిపిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మృతుల సంఖ్య లక్ష దాకా ఉండొచ్చని అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వెనెజువెలా పశ్చిమ ప్రాంతంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని కారకాస్‌కు పశ్చిమంగా ఉన్న సాన్‌ ఫెలిపే సమీపంలో దీని కేంద్రం నమోదైంది. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే యుమారే ప్రాంతం వద్ద మరో 7.5 తీవ్రతతో మరింత శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత 20 సార్లు భూమి స్వల్పంగా కంపించింది. 

ఈ ధాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే.. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్‌ సరఫరా అంతరాయం కలగడం తీవ్ర నష్టాన్ని కలిగించాయని తెలుస్తోంది.

ఈ ఘటనను "సిస్మిక్‌ డబ్లెట్‌"(seismic doublet earthquake)గా యూఎస్‌జీఎస్‌ అభివర్ణించింది. అంటే.. చాలా తక్కువ వ్యవధిలో ఒకే ప్రాంతాన్ని రెండు భారీ భూకంపాలు తాకడం. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది. మృతుల సంఖ్య 10 వేలుగా ఉండొచ్చని స్థానిక మీడియా చానెల్స్‌ కథనాలు ఇస్తున్నాయి. కానీ, భూకంపం తీవ్రతను బట్టి ఆ సంఖ్య లక్ష వరకు చేరవచ్చని యూఎస్‌జీఎస్‌ అంచనా వేస్తోంది. అయితే అధికారికంగా ఇప్పటివరకు మృతులు, గాయపడిన వారి సంఖ్యను వెనెజువెలా ప్రభుత్వం ప్రకటించలేదు.

 

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాష్ట్ర టెలివిజన్‌ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వెల్లడించారు.

భూకంప ప్రభావంతో కారకాస్‌ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. జూన్‌ 24న వెనెజువెలాకు జాతీయ సెలవు దినం. దీంతో ఇళ్లలోనే ఎక్కువ మంది ఉండిపోయారు. దీంతో మృతుల సంఖ్కయ ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. 

ఇక అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించింది. మరోవైపు ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు నయీబ్‌ బుకెలె, అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలు మరియా ఎల్విరా సలజార్‌, వెనెజువెలా ప్రతిపక్ష నేతలు సహా పలువురు అంతర్జాతీయ నాయకులు వెనెజువెలా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.

ప్రస్తుతం వెనెజువెలా వ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల తొలగింపు, దూర ప్రాంతాల నుంచి సమాచారం సేకరణ పూర్తయిన తర్వాతే అసలు నష్టం, ప్రాణనష్టం ఎంత జరిగిందన్న విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. భూకంపాల తీవ్రత దృష్ట్యా వెనెజువెలా ఇటీవల కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తులలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

వెనుజువెలాలో భయంకర భూకంపం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement