మీకు చెప్పడానికి నాలుగు మాటలున్నాయి
ధనవంతులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
కష్టపడి పనిచేసేవారికి తగిన హక్కులు ఉండాల్సిందే
వలసదారులపై సాగిస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటాం
మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దాని స్పష్టీకరణ
న్యూయార్క్: న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై నిప్పులు చెరిగారు. వలసదారులపై సాగిస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటానని తేల్చిచెప్పారు. రాజకీయ వారసత్వానికి కాలం చెల్లిందని స్పష్టంచేశారు. తన ఎన్నికను అణచివేత, నిరంశకుత్వంపై విజయంగా, ఒక ఆశారేఖగా అభివర్ణించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చరిత్రాత్మక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని మమ్దాని ప్రస్తావించారు.
చీకటి నుంచి వెలుగులోకి, పాత యుగం నుంచి కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం అర్ధరాత్రి బ్రూక్లిన్ పారామౌంట్‌లో మమ్దాని వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. భవిష్యత్తు మన చేతుల్లోని ఉందని అన్నారు. రాజకీయ వారసత్వాన్ని, రాజవంశాన్ని కూల్చేశామని చెప్పారు.
మార్పు కోసం, కొత్త తరం రాజకీయాల కోసం న్యూయార్క్ సిటీ గొప్ప తీర్పు ఇచ్చిందని ప్రశంసించారు. నూయార్క్‌ను మన జీవనానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఈ తీర్పు వచ్చిందన్నారు. ప్రజలకు నిజాయతీగా సేవ చేసే ప్రభుత్వం కోసం తీర్పు లభించిందన్నారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య మమ్దాని ఇంకా ఏం మాట్లాడారంటే...
అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం
‘‘ఈరోజు మీ ముందుకు రావడం గర్వంగా ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ మాటలు గుర్తుచేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక శకం ముగిసినప్పుడు.. పాత శకం నుంచి కొత్త శకం వైపు అడుగులు వేసినప్పుడు.. సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఒక జాతి ఆత్మ తన గళం వినిపించినప్పుడు.. చరిత్రలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. ఈరోజు పాత శకం నుంచి నూతన శకంలోకి ప్రవేశించాం. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎవరూ అపార్థం చేసుకోకుండా స్పష్టంగా, సంకల్పంతో మాట్లాడుకుందాం. వలసదారులతోనే న్యూయార్క్ మరింత శక్తివంతంగా మారుతుంది. ఇకపై వలసదారుడే నగరానికి సారథ్యం వహించబోతున్నాడు.
ఒక గొప్ప మార్పునకు మనం కలిసికట్టుగా నాంది పలుకుదాం. అణచివేతను ఎదుర్కొందాం. అంతులేని అధికారం అండతో వలసదారులపై పగబట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు బుద్ధి చెబుదాం. డొనాల్డ్ ట్రంప్.. మీరు నా మాటలు వింటున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నాలుగు మాటలున్నాయి. అందుకే సౌండ్ పెంచుకోండి. ధనవంతులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఎందరో ట్రంప్‌లు ప్రజలను అడ్డం పెట్టుకొని అక్రమంగా పైకి ఎదిగారు. ట్రంప్ లాంటి బిలియనీర్లు పన్నులు ఎగవేశారు. పన్ను చట్టాలను ఉల్లంఘించారు. ఇకపై అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం. కార్మిక, ప్రజా సంఘాలకు అండగా ఉంటాం. కార్మికుల రక్షణలు మరింత విస్తరింపజేస్తాం. కష్టపడి పనిచేసేవారికి తగిన హక్కులు ఉండాల్సిందే.
ఏ జాతి వారైనా ప్రియమైనవారే..
రాజకీయ అంధకారం నుంచి న్యూయార్క్‌ను వెలుగులోకి నడిపిస్తాం. మేము ప్రేమించేవారందరికీ మేము తోడుగా ఉంటాం. వారు వలసదారులైనా, ట్రాన్స్‌జెండర్లయినా, ఏ జాతి వారైనా మాకు ప్రియమైనవారే. ఓ నల్లజాతి మహిళను ప్రభుత్వం ఉద్యోగం నుంచి డొనాల్డ్డ్‌ట్రంప్ అన్యాయంగా తొలగించారు. ఆ ఒంటరి మహిళ చాలా కష్టాలు పడుతూ బతుకు పోరాటం చేస్తోంది. అందుకే ప్రజల కష్టాలు మా కష్టాలుగానే భావిస్తాం.
న్యూయార్క్‌లో అన్ని జాతులకూ సమానమైన ఆదరణ లభిస్తుంది. ఎవరిపైనా ఎలాంటి వివక్ష ఉండదు. నగరంలో ఇస్లామోఫోబియాకు స్థానం లేదు. ముస్లింలు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, విజయం సొంతం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యువకుడిని. వృద్ధుడిగా మారినా కూడా ముస్లింగానే ఉంటాను. నేనొక డెమొక్రటిక్ సోషలిస్ట్‌ను. ముస్లింను అయినందుకు క్షమాపణ చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకు నిరాకరిస్తున్నా. నన్ను గెలిపించినందుకు న్యూయార్క్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
ధూమ్ మచాలే ధూమ్
ఇలాంటి రోజు ఒకటి ఎప్పటికీ రాదని చాలామంది భావించారు. రాజకీయాలు చాలా క్రూరంగా మారాయని అనుకున్నారు. ఆశను కోల్పోయారు. అలాంటి భయాలకు న్యూయార్క్ నేడు సమాధానం చెప్పింది. ఆశారేఖ సజీవంగానే ఉంది. అసాధ్యం సుసాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించడం వల్లే మనం గెలిచాం. వచ్చే ఏడాది జనవరి 1న మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తా. నా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నన్ను తీర్చిదిద్దింది వారే. నా భార్య రమా దువాజీకి కూడా కృతజ్ఞతలు’’ అని మమ్దాని పేర్కొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తల్లిదండ్రులు, భార్య అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘ధూమ్’లోని ‘ధూమ్ మచాలే ధూమ్’ పాట మార్మోగిపోయింది.


